హైదరాబాద్: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. 2026, మార్చి 7న తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అంతకుముందు సరెండర్ అయిన మావోయిస్టులను భారీ భద్రత నడుమ ప్రత్యేక బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు తరలించారు పోలీసులు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఎదుట ఆయుధాలతో సహా సరెండర్ అయ్యారు మావోయిస్టులు. ఈ సందర్భంగా మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలను సీఎం రేవంత్ పరిశీలించారు.
అనంతరం పునరావాసం కింద సరెండర్ అయిన మావోయిస్టులకు రివార్డ్ చెక్లు అందజేశారు సీఎం రేవంత్. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులు 124 తుపాకులను అప్పగించినట్లు తెలిపారు. ఒక INSAS LMG రైఫిల్, (31) AK-47 రైఫిళ్లు, (21) INSAS రైఫిళ్లు, (20) SLR రైఫిళ్లు, (18) 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులను అప్పగించినట్లు తెలిపారు.
