72 రోజుల్లో 48 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి : 15 ఏళ్ల స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే వరస్ట్..!

72 రోజుల్లో 48 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి : 15 ఏళ్ల స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే వరస్ట్..!

భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో 2026 ఏడాది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతోంది. గడిచిన 15 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల సంపద సునామీలో కొట్టుకుపోయినట్లుగా ఆవిరైపోతోంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే భారత మార్కెట్ విలువ ఏకంగా 533 బిలియన్ డాలర్లు పతనమైంది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ రూ.48 లక్షల కోట్లు. ఈ భారీ నష్టం ఎంతటిదంటే.. మెక్సికో, మలేషియా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాల మొత్తం మార్కెట్ విలువ కంటే ఇది చాలా ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే.. కొన్ని దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువ సంపద మన మార్కెట్లో కేవలం రోజుల్లోనే గాలిలో కలిసిపోయింది.

ఈ సంపద ఆవిరికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా ముసురుకున్న యుద్ధ వాతావరణమే. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు గ్లోబల్ మార్కెట్లను వణికిస్తున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటడం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశానికి శాపంగా మారింది. ఒకవేళ ఇరాన్ హెచ్చరించినట్లు క్రూడ్ ఆయిల్ ధర 200 డాలర్లకు చేరితే పరిస్థితి ఊహకందని విధంగా ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల మన దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌ను సుమారు రూ.81 వేల కోట్ల మేర పెంచుతుంది. ఇది రూపాయి విలువను తగ్గించడమే కాకుండా దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచి వస్తుసేవల ధరలను పెంచేస్తుంది. 

ఈ ఏడాది ఆరంభం నుంచి సెన్సెక్స్ 10.8 శాతం, నిఫ్టీ 9.5 శాతం మేర నష్టపోయాయి. కేవలం బ్లూచిప్ కంపెనీలే కాకుండా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా 7 నుండి 10 శాతం వరకు పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారత్ నుంచి వెనక్కి తీసుకోవడం మార్కెట్లను మరింత బలహీనపరిచింది. మరోవైపు ఏఐ రంగంలో తగినంత ఎక్స్‌పోజర్ లేకపోవడం.. కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారత మార్కెట్ రేటింగ్‌ను 'ఈక్వల్‌ వెయిట్'కు తగ్గించడం ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన నింపింది.

ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలు ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పారిశ్రామిక కార్యకలాపాలను నెమ్మదింపజేశాయి. చాలా నగరాల్లో హోటళ్లు, వాణిజ్య సంస్థలు గ్యాస్ దొరకక మూతపడ్డాయి. మార్కెట్ విలువ 2026 ప్రారంభంలో 5.3 ట్రిలియన్ డాలర్లు అంటే రూ.477 లక్షల కోట్లు ఉండగా.. అది ఇప్పుడు 4.77 ట్రిలియన్ డాలర్లు అంటే రూ.429 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్ల చేతిలో ఉండాల్సిన సుమారు 48 లక్షల కోట్ల రూపాయల సంపద కళ్లముందే కరిగిపోయింది. ప్రస్తుతానికి మార్కెట్ అట్టడుగు స్థాయికి చేరుకుందా లేదా ఇంకా పతనం మిగిలే ఉందా అనే ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.