తెల్లారితే ఇరాన్ జాతి మెుత్తాన్ని లేకుండా చేస్తామన్న ట్రంప్ బుధవారం యుద్ధానికి బ్రేకులు పడినట్లు ప్రకటించారు. రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఉంటుందని చేసిన ప్రకటన ప్రపంచ స్టాక్ మార్కెట్లతో పాటు భారతీయ ఈక్విటీ మార్కెట్లను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ప్రస్తుతానికి ఇరాన్ అమెరికా మధ్య పోరుకు బ్రేక్ పడటంతో ఇన్వెస్టర్ల బుల్ జోరుతో మార్కెట్లలో దూసుకుపోతున్నారు. దీనికి తోడు రిజర్వు బ్యాంక్ కూడా తన ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకుండా యథాతథ స్థితిని కొనసాగించటంతో కొత్త జోష్ నెలకొంది.
ఉదయం 10.50 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 2764 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 820 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 2690 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 2032 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో జోరు మీద ఉన్నాయి. ఈ క్రమంలో మార్కెట్లో దాదాపు అన్ని రంగాలకు చెందిన స్టాక్స్ గ్రీన్ గా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సానుకూల పవనాల వల్ల భారత స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీని సాధించాయి. ఈ క్రమంలో మార్కెట్ పరుగులు తీయడానికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే..
1. యుద్ధానికి బ్రేక్:
అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు యుద్ధానికి బ్రేక్ ప్రకటించడం ఇన్వెస్టర్లలో భరోసా నింపింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని ప్రపంచ శాంతికి గొప్ప రోజుగా అభివర్ణించారు. ఈ దౌత్యపరమైన ముందడుగు వల్ల భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గాయి.
2. తగ్గిన క్రూడ్ ధరలు:
హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి షిప్స్ సురక్షిత రవాణాకు ఇరాన్ అంగీకరించడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర 13.24% తగ్గి, బ్యారెల్‌కు 94.80 డాలర్లకు చేరుకుంది. భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాలకు ఇది ద్రవ్యోల్బణ నియంత్రణలో పెద్ద ఊరట.
3. ప్రపంచ మార్కెట్ల జోరు:
ఆసియా మార్కెట్లతో పాటు వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ 3 శాతానికి పైగా లాభపడ్డాయి. దీనికి తోడు రూపాయి విలువ 50 పైసలు పెరిగి డాలర్‌తో పోలిస్తే 92.56 వద్దకు చేరడం దేశీ మార్కెట్లకు బలాన్నిచ్చింది.
4. ఆర్బీఐ వడ్డీ రేట్లు:
ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని అందుపులో ఉంచుతూనే.. ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరిగే అవకాశం ఉండటంతో బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. మెుత్తానికి నెల రోజుల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ఒక కీలక ముందడుగు పడటంతో మార్కెట్లు తేరుకున్నాయి. వరుస నష్టాల నుంచి ఒక్కసారిగా కొనుగోళ్ల కోలాహలంతో బుధవారం ఇంట్రాడేలో దూసుకుపోతున్నాయి.
