
- ట్రోఫీ నెగ్గిన తొలి అన్‌సీడెడ్ ప్లేయర్‌గా రికార్డు
- టైటిల్ గెలిచిన తక్కువ ర్యాంకర్గానూ ఘనత
ర్యాంక్ చూస్తే గొప్పగా లేదు..! హోదా చూస్తే అన్‌సీడెడ్..! ఫేవరెట్ జాబితాలో పేరే లేదు..! ఆట చూసినా అంతంతమాత్రమే..! కెరీర్‌లో మేజర్ టైటిల్ గెలిచిన దాఖలా అసలే లేదు..! కానీ రెండు వారాలు తిరిగే సరికి ఆమె వింబుల్డన్ చాంపియన్..! అతి తక్కువ ర్యాంక్‌తో, అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి ఏకంగా టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్‌గా 24 ఏండ్ల మార్కెటా వొండ్రుసోవా సరికొత్త చరిత్ర సృష్టించింది..! ఆమె కెరీర్‌లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం మరో విశేషం!!
వింబుల్డన్: అన్‌సీడెడ్‌గా వచ్చి అద్భుతంగా ఆడిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ మార్కెటా వొండ్రుసోవా వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో వొండ్రుసోవా 6–4, 6–4తో ఆరోసీడ్ ఆన్స్ జబెర్ (ట్యూనీషియా)పై గెలిచింది. దీంతో మెగా ట్రోఫీని నెగ్గిన అతి తక్కువ ర్యాంకర్ (42), అన్‌సీడెడ్ ప్లేయర్‌గా వొండ్రుసోవా చరిత్ర సృష్టించింది. గత 60 ఏళ్లలో ఫైనల్ చేరిన తొలి అన్‌సీడెడ్ ప్లేయర్‌గానూ రికార్డులకెక్కింది. 1963 ఫైనల్లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన బిల్లి జీన్ కింగ్ రన్నరప్‌గా నిలిచింది. రాయల్ బాక్స్‌లో ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్‌తో కలిసి బిల్లీ ఈ మ్యాచ్‌ను చూడటం విశేషం. టీనేజర్‌గా 2019 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడిన వొండ్రుసోవా ఈసారి మాత్రం గ్రాండ్‌స్లామ్ కలను నెరవేర్చుకుంది. ఎడమ మణికట్టు గాయంతో గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఆటకు దూరమైన వొండ్రుసోవా 99వ ర్యాంక్‌తో 2022ను ముగించింది. వింబుల్డన్ రికార్డులోనూ 1–4తో వెనకంజలో ఉన్న చెక్ ప్లేయర్ టైటిల్ గెలుస్తుందని రెండు వారాల కిందట ఎవరూ ఊహించలేదు. విన్నర్‌గా నిలిచిన వొండ్రుసోవాకు ట్రోఫీతో పాటు రూ. 24 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. మరోవైపు ఇప్పటికే రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఫైనల్ చేరిన తొలి అరబ్, నార్త్ ఆఫ్రికన్ మహిళ అయిన జబెర్కు మూడో ఫైనల్లోనూ నిరాశే ఎదురైంది. గతేడాది వింబుల్డన్‌లో ఎలెనా రిబకినా చేతిలో, యూఎస్ ఓపెన్‌లో ఇగా స్వైటెక్ చేతిలో ఓడింది. ఇప్పుడు వొండ్రుసోవా రూపంలో అడ్డంకి ఎదురైంది.
పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో..
జబెర్‌తో గంటా 20 నిమిషాల మ్యాచ్‌లో వొండ్రుసోవా పర్‌ఫెక్ట్ గేమ్ ప్లాన్‌తో ఆడింది. స్టేడియం బయట గాలి ఎక్కువగా ఉండటంతో సెంటర్ కోర్టు రూఫ్‌ను మూసి మ్యాచ్‌ను కొనసాగించారు. దీంతో వొండ్రుసోవా తన ట్రేడ్ మార్క్ లెఫ్ట్ హ్యాండ్ సర్వీస్‌లతో ఆన్స్‌ను కట్టడి చేసింది. రెండు సెట్లలోనూ ఆరంభంలో వెనకబడ్డ చెక్ ప్లేయర్ తొలి సెట్‌లో ఆఖరి నాలుగు గేమ్‌లను, రెండో సెట్‌లో చివరి మూడు గేమ్స్‌ను నెగ్గింది. జబెర్ 27 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేస్తే వొండ్రుసోవా 13కే పరిమితమైంది. ఏడు బ్రేక్ పాయింట్లలో ఆరింటిని కాచుకుంది. జబెర్ 10లో నాలుగింటిని సద్వినియోగం చేసుకుంది.