మర్రి చెన్నారెడ్డి జయంతి.. నేతల నివాళి

మర్రి చెన్నారెడ్డి జయంతి.. నేతల నివాళి

ఇవాళ ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, మాజీ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి 103 వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మర్రి చెన్నారెడ్డి రాక్ గార్డెన్ లో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, కొండ విశ్వేశ్వర్ రెడ్డిలు పాల్గొని, ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. "మా నాన్న కాకా నేను చిన్నగా ఉన్నప్పుడు చెన్నారెడ్డి చేసిన మంచి పనులు మాకు చెప్పే వారు". చెన్నారెడ్డి దేశంలోనే ఉత్తమ అడ్మినిస్ట్రేటర్ అని కొనియాడారు.1969 తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి పాత్ర మరువలేనిదన్నారు. చనిపోయే వరకు తెలంగాణ కోసం పరితపించిన నాయకుడు మర్రి చెన్నారెడ్డి అని వివేక్ పేర్కొన్నారు.

మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజస్థాన్ లో బ్రహ్మ కుమారిస్ కు జాగా ఇచ్చింది చెన్నారెడ్డి అని అన్నారు. చెన్నారెడ్డి వలనే తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు పోకుండా ఇక్కడే స్థిర స్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన సేవలు మరువలేనివన్నారు.

రాజ్యసభ సభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. "పార్టీలతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న వారు ఇంటికి వెళితే చెన్నారెడ్డి ఆదుకునే వారని గుర్తు చేసుకున్నారు. గతంలో రాష్ట్రంలో పాత బస్తీలో అల్లర్లు జరిగితే.. మేము మా పార్టీ తరపున చెన్నారెడ్డి దగ్గరికి వెళితే ఆ సమస్యపై మాతో అర్ధ రాత్రి వరకూ మాట్లాడి ఆ  సమస్య పరిష్కారం చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సమస్య వస్తే సీఎం, మంత్రులు పట్టించుకునే వారు దిక్కు లేదు. చెన్నారెడ్డి రాజకీయాలకు అతీతంగా ఉండే వారు. ఆయన కలలు కన్న తెలంగాణ వచ్చిన రోజే నిజమైన తెలంగాణ వచ్చినట్టు. అన్ని వర్గాలకు న్యాయం జరిగిన రోజే నిజమైన తెలంగాణ వచ్చినట్టు" అని అన్నారు.

సీఎంగా, గవర్నర్​గా మర్రి చెన్నారెడ్డి సేవలు

ఆంధ్రప్రదేశ్​ రాజకీయాలపై మర్రి చెన్నారెడ్డి చెరగని ముద్ర వేశారు. రాజకీయ దురంధరుడిగా.. పరిపాలనాదక్షుడుగా ఆయన నడిచిన బాట అనితర సాధ్యమైనది. ప్రస్తుత వికారాబాద్​ జిల్లా.. మార్పల్లి మండలం సిరిపురం గ్రామంలో శంకరమ్మ, లక్ష్మారెడ్డి దంపతులకు 1919 జనవరి 13న చెన్నారెడ్డి జన్మించారు. 1970  మధ్య కాలంలో ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు, పాండిచ్చేరి గవర్నర్‌‌గా పని చేశారు. 1978 జనవరి 18న కాంగ్రెస్(ఐ) రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టారు.

1978 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నారెడ్డి కృషితో కాంగ్రెస్(ఐ) 180 స్థానాలు గెలుచుకుంది. చెన్నారెడ్డి 1978 మార్చి 6న సీఎం పదవి చేపట్టారు. 1989 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పార్టీని విజయ పథంలో నడిపించారు. 1989 డిసెంబర్‌‌లో రెండోసారి సీఎం పదవి చెపట్టారు. ఆ తర్వాత ఎన్నికల్లో రాజకీయాలకు దూరమై మరణించే వరకూ ఇతర రాష్ట్రాల్లో గవర్నర్‌‌ గా కొనసాగారు. 1996 డిసెంబర్ 2న చెన్నారెడ్డి తుదిశ్వాస విడిచారు.