బీజేపీలో చేరిక ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మర్రి శశిధర్ రెడ్డి

బీజేపీలో చేరిక ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మర్రి శశిధర్ రెడ్డి

బీజేపీలో చేరనున్నారంటూ వస్తున్న వార్తలపై మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి వెళ్లడం కొత్త కాదని, మనవడి స్కూల్ ఫంక్షన్ లో పాల్గొనేందుకు ఇప్పుడు వచ్చినట్లు చెప్పారు. తానింకా రాజకీయాల్లోనే ఉన్నానని, రిటైర్ కాలేదని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయన వెంట ఉన్నారన్న వార్తలపైనా క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చిన విమానంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారన్న ఆయన.. బీజేపీలో చేరేందుకే ఢిల్లీకి వచ్చానంటూ పుకార్లు పుట్టించడం సరికాదని హితవు పలికారు. 

మర్రి శశిథర్ రెడ్డి కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వారిద్దరూ హైకమాండ్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. ఒక దశలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందినట్లు స్వయంగా వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.