
వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. అప్పటి వరకు సాఫీగా సాగుతోన్న పచ్చని సంసారంలో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. దీంతో భర్తను భార్య చంపడం, భార్య భర్తను చంపుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పిల్లలున్నా వివాహేతర సంబధాలు పెట్టుకుంటూ ప్రాణాలు తీస్తున్నారు.
ఓ యువకుడితో ఎఫైర్ పెట్టుకున్న ఓ మహిళ అతని ఇంట్లోనే ఉరేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని నాగోల్ లో గత మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే.? హైదరాబాద్ నాగోల్ పరిధిలో ఉంటున్న బానోత్ అనిల్ నాయక్(24) అనే యువకుడితో మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చెందిన స్వరూప(38) అనే వివాహిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే తన కుమారుడు(3)కి చికిత్స చేయిస్తానని చెప్పి నాగోల్ లో ఉంటున్న ప్రియుడు అనిల్ ఇంటికి వచ్చింది. రెండు రోజులు ప్రియుడి ఇంట్లోనే గడిపింది మహిళ.
అనిల్ కూరగాయల కోసం బయటకు వెళ్లి వచ్చేసరికి బాత్రూంలో హ్యాంగర్‌కు చీరతో ఉరివేసుకుంటున్నట్లు కనిపించింది మహిళ. వెంటనే తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు అనిల్. అయితే అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచింది. మహిళ మృతదేహం తన ఇంట్లో ఉందని తెలిస్తే పరువు పోతుందని భయపడిన అనిల్ సహాయం కోసం ఎవరిని పిలవలేదు . భయంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అనిల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు . ఆత్మహత్యకు ప్రేరేపించిన అనిల్ పై కేసు నమోదు చేసిన నాగోల్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే నాగోల్ చేరుకుని అనిల్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు బాధిత మహిళ బంధువులు, కుటుంబ సభ్యులు.