40% తగ్గిన మారుతి లాభం

40% తగ్గిన మారుతి లాభం

న్యూఢిల్లీ: ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌‌ఐ) ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్‌‌కు ప్రకటించిన నష్టాలు ఎనలిస్టులు వేసిన అంచనాల కంటే తక్కువగానే వచ్చాయి. గత సెప్టెంబరు క్వార్టర్‌‌తో పోలిస్తే లాభం 39.4 శాతం తగ్గి రూ.1,358 కోట్లుగా రికార్డయింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌‌లో ఎంఎస్‌‌ఐ రూ.2,230 కోట్ల లాభం సంపాదించింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం వల్ల డిమాండ్‌‌ తగ్గి అమ్మకాలు పడిపోవడమే ఈ పరిస్థితికి కారణమని కంపెనీ ఎక్సేంజీ ఫైలింగ్‌‌లో తెలిపింది. అయితే కార్పొరేట్‌‌ ట్యాక్స్‌‌ ఖర్చులు బాగా తగ్గడం, ఇతర ఆదాయాలు పెరగడం వల్ల లాభాల పతనం 40 శాతానికే పరిమితమయింది.

‘‘అమ్మకాలు తగ్గడంతోపాటు ప్రచారం ఖర్చు, తరుగుదల ఎక్కువయ్యాయి. రేట్లను తగ్గించాల్సి వచ్చింది. అయితే పొదుపు చర్యలు, కార్పొరేట్‌‌ ట్యాక్స్‌‌ తగ్గడం వల్ల నష్టాలు మరీ ఎక్కువగా నమోదు కాలేదు’’ అని కంపెనీ వివరించింది.  మొత్తం ఆదాయం వార్షికంగా 24.3 శాతం తగ్గి రూ.16,985 కోట్లుగా రికార్డయింది. ఇదేకాలానికి అమ్మకాలు 30 శాతం పతనమయ్యాయి. ‘‘ఈ ఏడాది వాహన అమ్మకాలు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. బీఎస్‌‌–6 స్టాండర్డ్స్‌‌కు తగ్గట్టు ఇంజన్‌‌ను తయారు చేయడం, బీమా ఖర్చులు ఎక్కువ అవడం, చాలా రాష్ట్రాల్లో రోడ్‌‌ ట్యాక్స్‌‌ను పెంచడం వల్ల కారు తయారీ వ్యయం భారీగా పెరిగింది. కస్టమర్లకు ఫైనాన్స్‌‌ దొరకడం కొద్దిగా కష్టమైంది. డౌన్‌‌ పేమెంట్‌‌ మొత్తాలు మాత్రం పెరిగాయి. దీనివల్ల కారు కొనేవారి సంఖ్య తగ్గింది’’ అని ఎక్సేంజీకి మారుతీ సుజుకీ వివరించింది.

తగ్గిన ఇబిటా, మార్జిన్‌‌

తాజా క్వార్టర్‌‌లో కంపెనీ ఇబిటా 53.2 శాతం తగ్గి రూ.1,603 కోట్లుగా నమోదయింది. మార్జిన్‌‌  9.5 శాతానికి తగ్గింది. సామర్థ్యాన్ని తక్కువగా ఉపయోగించుకోవడం, ప్రచారానికి ఎక్కువ ఖర్చు చేయడం, తరుగుదల నష్టాలే ఇందుకు కారణాలు. ఫలితాలు వెలువడ్డాక ఎంఎస్‌‌ఐ షేరు ఇంట్రాడేలో రెండు శాతం తగ్గింది. అయితే మెజారిటీ ఎనలిస్టులు ఈ షేరుకు ఇచ్చిన ‘హోల్డ్‌‌’ రేటింగ్‌‌ను మార్చలేదు. ఈ విషయమై రిలయన్స్‌‌ సెక్యూరిటీస్‌‌కు చెందిన మితుల్‌‌ షా మాట్లాడుతూ ఎకానమిక్‌‌ గ్రోత్‌‌ 6–6.5 శాతం దాటితే వినిమయం పెరుగుతుందని, అప్పుడే రేటింగ్‌‌ను మార్చే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఇదిలా ఉంటే, మారుతికి ఈసారి రూ.922 కోట్ల లాభం, రూ.16,765 కోట్ల ఆదాయం వస్తుందన్న అంచనాలకు మించి కంపెనీ ఫలితాలు ఉండటం గమనార్హం.