
అలంపూర్ సరిహద్దులో పంచలింగాల చెక్ పోస్టు వద్ద పట్టుకున్న నిఘా టీమ్
పాత పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి వాసి సంతోష్ వద్ద రూ.16 లక్షల 40 వేలు సీజ్
కర్నూలు జిల్లా: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలాంటి రశీదులు, ఆధారాలు లేకుండా నగదు తరలించే వారిపట్ల పోలీసులు, అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలొనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన సంతోష్ రూ. 16లక్షల 40 వేల రూపాయల నగదు తీసుకుని వెళ్తుంటే పట్టుకున్నారు పోలీసులు. కల్వకుర్తితో ఉదయమే బయలుదేరి రాగా.. మధ్యాహ్నం సమయంలో అలంపూర్ చెక్ పోస్టు దగ్గర గురువారం ఏపీ ప్రత్యేక నిఘా బృందం తనిఖీలు చేసింది.
బ్యాగులో పెద్ద మొత్తం డబ్బు తీసుకుని వెళ్తుంటే గుర్తించారు. కల్వకుర్తికి చెందిన సంతోష్ అనే వ్యక్తి అనంతపురంలో వ్యవసాయ పనిముట్లు కొనేందుకు ఈ డబ్బు తీసుకువెళ్తున్నట్లు చెప్పినా సరైన ఆధారాలు చూపించలేదు. తెచ్చిన డబ్బు తాలూకు వివరాలు కూడా సరిగా చెప్పలేకపోవడంతో కర్నూలు జిల్లా డిప్యూటీ తాహశీల్దార్ చంద్రకళ, తాలుకా ఎస్.ఐ జయశేఖర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక నిఘా బృందం సదరు డబ్బును సీజ్ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని.. ఈ మొత్తం ఆదాయ పన్నుశాఖ అధికారులకు పంపుతామని ఎస్ఎస్టి టి తనిఖీ టీమ్ అధికారులు తెలిపారు.