హైదరాబాద్, వెలుగు: శేర్ లింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో భారీగా దొంగ ఓట్లు నమోదు చేశారని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రెండు గదులు, ఒక బాత్రూం ఉన్న షెడ్లో 28 మంది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు నివసిస్తున్నారని పేర్కొంటూ ఓటరు లిస్ట్‌ను బుధవారం ట్విట్టర్ లో ఆయన పోస్టు చేశారు.
దొంగ ఓట్లను సీఎం కేసీఆర్ ఆయుధంగా మలుచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వేలాది దొంగ ఓట్లు ఉన్నాయని గుర్తించి, ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. శేర్ లింగంపల్లి నియోజకవర్గంలో 70 వేల దొంగ ఓట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా మణికొండ మున్సిపాలిటీలో దొంగ ఓట్లు బయట పెట్టామని ఆయన గుర్తుచేశారు.
ఒకే ఇంటి నంబర్లో 50 ఓట్లు ఉన్నాయని, ఆ అడ్రస్ కు తాము వెళ్లి చూస్తే అక్కడ ఫర్నిచర్ షాప్ ఉందని, ఆ అడ్రస్‌లో ఒక్కరు కూడా నివాసం ఉండటం లేదని తెలిపారు. తమ ఫిర్యాదుతో ఆ ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగించిందన్నారు. ఇప్పటి కైనా దొంగ ఓట్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
