హైదరాబాద్ లో కాక్రాచో జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఆదివారం (జూన్ 14) ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో చేపట్టిన ఆందోళనకు భారీ ఎత్తున నిరుద్యోగ యువకులు, పార్టీ మద్ధతుదారులు హాజరయ్యారు. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే, హక్కుల కార్యకర్త సోనం వాంగ్ చుక్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ తదిరత ప్రముఖ వ్యక్తుల పాల్గొన్న ఈ ధర్నా.. నీట్ లీకేజీకి కారణమైన మంత్రి రాజీనామా డిమాండ్లతో మారుమోగింది.
ఈ సందర్భంగా హక్కుల కార్యకర్త సోనం వాంగ్ చుక్ మాట్లాడుతూ.. నీట్ లీకేజీలకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీతో లక్షల మంది విద్యార్థులు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ లీకేజీలపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాక్రోచ్ ఉద్యమం దీర్ఘకాలికంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. కలలు కంటే మేరా భారత్ మహాన్ నినాదం నిజం కాదని గుర్తు చేశారు. యువత పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కోట్ల మంది యువతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోదీపై ఉందన్నారు.
ఆకునూరి మురళి:
ధర్నాలో పాల్గొన్న మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోనే నెంబర్ వన్ దుర్మార్గుడు మోదీ అని విమర్శించారు. దేశంలో కనీసం పరీక్షలను సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. దేశద్రోహులను మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు.
మోదీ ప్రభుత్వం లంచగొండుల ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఎంతో సంపద ఉంది.. అయినా ఇన్ని కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య ఇవ్వలేని పరిస్థితిలో పాలకులు ఉన్నారని అన్నారు.
సంపద అంతా అంబానీ, ఆదానీ చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారు.
