- మనీ సర్క్యులేషన్ స్కీమ్స్‌తో
- యువత, గృహిణులు లక్ష్యంగా చీటింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు : దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతూ అక్రమ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్‌ను ప్రోత్సహిస్తున్న విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (క్యూ నెట్) సంస్థ ఆఫీసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కర్నాటకలో తనిఖీలు చేపట్టి.. నాలుగు కేసులు నమోదు చేసి 32 మందిని అరెస్టు చేశారు. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు.
22 మంది నిందితులు హైదరాబాద్ కు చెందిన వారే. వీరు గ్రూపు లీడర్లుగా, మోటివేటర్లుగా, లోన్ ఏజెంట్లుగా పనిచేస్తూ పెట్టుబడి పేరుతో సేకరించిన డబ్బును బాధితుల అనుమతి లేకుండానే మల్టీ లెవల్ మార్కెటింగ్ విధానంలోకి మళ్లించేవారు. కేసు వివరాలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ సోమవారం హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయంలో వెల్లడించారు.
5 లక్షలు పెడితే 3 కోట్లు వస్తాయని...
క్యూ నెట్ సంస్థ ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుంది. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, ఈ- కామర్స్ వ్యాపారం, అధిక లాభాలు, పెట్టుబడుల పేరుతో ఆకర్షిస్తూ ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా వసూలు చేసింది. రెండేళ్లలో రూ. 3 కోట్ల నుంచి 4 కోట్ల లాభాలు వస్తాయని నమ్మించింది. హైటెక్ సిటీలోని పలు స్టార్ హోటల్స్‌లో మీటింగ్స్పెట్టి కంపెనీలో జాయిన్ కావాలని నిందితులు మోటివేషన్ స్పీచ్‌లు ఇప్పించేవారు.
సిద్దిపేటలో బాధితుడి ఆత్మహత్య
నిందితుల మాటలు నమ్మిన, సిద్దిపేటకు చెందిన హరికృష్ణ రూ.5 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. లాభాలు రాకపోవడంతో 2025 అక్టోబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. క్యూ నెట్ అనేది మోసమని, తాను మోసపోయానని, ఎవరూ మోసపోకూడదని సూసైడ్‌నోట్ రాశాడు. దీనిపై గౌరారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు మొదలుపెట్టగా నగరంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగా బాధితులు ఉన్నారని వెల్లడైంది. దీంతో సీపీ సజ్జనార్30 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా సదరు కంపెనీల్లో సోదాలు నిర్వహించారు.
క్యాన్సర్‌కు మందు ఉందంటూ..
క్యాన్సర్‌కు కూడా తమ దగ్గర మందు ఉందంటూ క్యూ నెట్ సంస్థ ఎందరినో మోసం చేసింది. సంస్థలో ఇష్టపూర్వకంగా చేరుతున్నామని ముందుగానే బాండ్ పేపర్లు, అఫిడవిట్‌లు రాయించుకునేవారు.
సాఫ్ట్వేర్ ఎంప్లాయ్స్‌కు సైడ్ ఇన్కమ్ అంటూ..
సాఫ్ట్వేర్ ఉద్యోగులను కూడా నిందితులు టార్గెట్ చేశారు. నగరంతో పాటు బెంగళూరు, వైజాగ్ తదితర చోట్ల చాలా మంది ఉద్యోగులను చేర్చుకున్నారు. పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోతే వాళ్లే ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా ఇప్పించేవారు. తమ సంస్థలో చైన్ సిస్టమ్‌లో కొత్త సభ్యులను చేర్పిస్తే మరింత ఆదాయం వస్తుందని నమ్మించేవారు. నాలుగు కేసుల్లోనే 11 మంది బాధితుల నుంచి సుమారు రూ.75 లక్షలు లాగారు. ఈ కేసును సీసీఎస్, డీడీ అధికారులు పర్యవేక్షణలో విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
