V6 News

పుష్కరాల అనంతరం కొండగట్టులో మాస్టర్ ప్లాన్ : ఎండోమెంట్ కమిషనర్ హనుమంత రావు

పుష్కరాల అనంతరం కొండగట్టులో మాస్టర్ ప్లాన్ : ఎండోమెంట్  కమిషనర్  హనుమంత రావు
  • ఎండోమెంట్ కమిషనర్ హనుమంత రావు

కొండగట్టు, వెలుగు: పుష్కరాల అనంతరం కొండగట్టులో మాస్టర్ ప్లాన్  పనులు ప్రారంభిస్తామని ఎండోమెంట్  కమిషనర్  హనుమంత రావు తెలిపారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టులో పని చేస్తున్న 45 మంది శానిటేషన్  సిబ్బంది రోజువారి వేతనాన్ని రూ.295 నుంచి రూ.495 పెంచడంతో కార్మికులు కమిషనర్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండగట్టులో 100 గదుల సత్రం నిర్మాణానికి ల్యాండ్  సేకరించి, సాయిల్  టెస్ట్​ పూర్తి చేశామన్నారు. 

మాస్టర్  ప్లాన్  చేపట్టడంతో పాటు గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో కొండగట్టు మహాక్షేత్రంగా మారుతుందని చెప్పారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈవో అంజనారెడ్డి, ఏఈవో హరిహర నాథ్, సూపరింటెండెంట్​ చంద్రశేఖర్, సర్పంచ్  ఆదిరెడ్డి, నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్  పాల్గొన్నారు.

కోడెలపై నిర్లక్ష్యం చేయవద్దు

వేములవాడరూరల్: రాజన్న కోడెల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని దేవాదాయ శాఖ కమిషనర్​ హన్మంతరావు ఆదేశించారు. మంగళవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని క్యూలైన్లు, సానిటేషన్​ ఏర్పాట్లు పరిశీలించి వేసవిలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. లడ్డూ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. 

ఆలయంలో చేపడుతున్న ఈ-టికెటింగ్​ సేవలను, గోశాలలో కోడెలకు అందించే పశుగ్రాసాన్ని, ఆహార నాణ్యతను పరిశీలించారు. గోశాలలో షెడ్లు, ఇతర సౌకర్యాలపై, బయోగ్యాస్​ ఉత్పత్తిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజన్న ఆలయ ఉద్యోగులు కమిషనర్​ను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట ఎండోమెంట్​ అడ్వైజర్​ గోవిందహరి, క్షేత్ర ఆర్కిటెక్​ సూర్యనారాయణమూర్తి, ఈవో రమాదేవి ఉన్నారు.