మహారాష్ట్ర సరిహద్దుల్లో.. జోరుగా మట్కా గ్యాంబ్లింగ్

మహారాష్ట్ర సరిహద్దుల్లో.. జోరుగా మట్కా గ్యాంబ్లింగ్

లాక్ డౌన్ తర్వాత స్థానిక ఏజెంట్లతో నిర్వహణ

అత్యాశతో మోసపోతున్న పేద ప్రజలు

ఫోన్లలోనే నంబర్ల బుకింగ్

చిన్నచిట్టీల ఆధారంగా పైసలు పేమెంట్

గత నెలలో ఇద్దరిపై కేసు

ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో మట్కా నిర్వహిస్తు న్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే దాడి చేసి సయ్యద్ మన్నన్ తోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.4 వేల నగదు, మట్కా చిట్టీలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ నెలలోనూ వీళ్లనే పట్టుకుని కేసు పెట్టారు.

ఎడపల్లి, వెలుగు: బోధన్ డివిజన్ పరిధిలో మట్కా జోరుగా సాగుతోంది. డివిజన్ లోని బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట్ మండలాల్లోని పలు గ్రామాలు మహారాష్ట్ర బార్డర్ లో ఉన్నాయి. మహారాష్ట్రలో మట్కా ఆటకు పర్మిషన్ ఉంటుంది. పలు కంపెనీలు ఏజెంట్లను పెట్టుకుని మరీ నిర్వహిస్తుంటాయి.బార్డర్ లో ఉన్న మన ఊర్లలోనూ కొందరు ఏజెంట్లు మట్కాను కొనసాగిస్తున్నారు. ఇదంతా సెల్ ఫోన్లలోనే నడిపిస్తున్ నారు. కానీ పోలీస్ ఆఫీసర్లు వ్యవహారాన్ని అంత సీరియస్గా తీసుకోవడంలేదు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు అత్యాశకు పోయి తీవ్రంగా నష్టపోతున్నారు. కలిసి వస్తే కోటీశ్వరులు కావచ్చని భావించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. హోటళ్లు, కల్లు దుకాణాల్లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చించుకుంటున్నారు.

మట్కా సాగుతుందిలా..

మట్కా ఆట నంబర్ల ఆధారంగా సాగుతుంది. ఇందుకు సంబంధించి ఒక చార్ట్ ఉంటుంది. దీన్ని సెల్ ఫోన్లలో ఆసక్తి ఉన్న వారికి పంపుతారు. అందులో నంబర్లను ఫిక్స్ చేసి పందేలు కాస్తారు. ఆ తర్వాత చిన్న చిట్టీ కొనుగోలు చేస్తారు. నిర్వాహకులు చార్ట్ లో నుంచి రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు నంబర్లు ఎంపిక చేస్తారు. ఆయా నంబర్లు కలిస్తే పైసలు చెల్లిస్తారు. ఉదాహరణకు నంబర్ 2పై రూ.100 పందేం కాస్తే రూ.10వేలు చెల్లిస్తా రు. దుగ్గి (2), పంజా(5), ఎక్కా(1) వంటి పదాలను ఉపయోగిస్తారు. వీరి వద్ద ఉన్న నంబర్లను మట్కా నిర్వాహకులు ఎంపిక చేస్తారో లేదో తెలియదు. ఒక్కోసారి ఆశ చూపేందుకు ఎంపిక చేస్తుండడంతో కొందరు ఆశతో అప్పులు చేసి మరీ వేలల్లో పందేలు కాస్తుంటారు. ఇదే టైమ్ లో చాలామంది పైసలు పోగొట్టుకుంటున్నారు. కొందరు మట్కాకు బానిసై ఇంట్లోని సామాన్లు అమ్మి ఆడుతున్నారు. మట్కా మొత్తం ఫోన్లలో నడుస్తున్నా ఓ చిన్న చిట్టీ ఆధారంగా పేమెంట్లు జరుగుతాయి.

ఎక్కడెక్కడ ఆడుతున్నారంటే..

మహారాష్ట్రకు ఆనుకుని బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట్ మండలాలు ఉన్నాయి. మహారాష్ట్రకు పది నుంచి 15 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది . ట్రైన్ చార్జీలు కూడా తక్కువగానే (రూ.10లోపే) ఉండడంతో గతంలో ఇక్కడి వారు నేరుగా మహారాష్ట్రలోని ధర్మాబాద్, దెగ్లూర్ తాలూకా కేంద్రాలకు వెళ్లి ఆడేవారు. కరోనా విజృంభిస్తు న్న నేపథ్యంలో ఇక్కడే జోరుగా కొనసాగిస్తున్నారు.

పోలీసులకు సవాల్

మహారాష్ట్రలో మట్కా నిర్వహణకు పర్మిషన్ ఉంటుంది. దీంతో అక్కడి పోలీసులు దాని గురించి పట్టించుకోరు. అయితే ఇక్కడ మట్కా ఫోన్లలో కొనసాగుతుండడం స్థానిక పోలీసులకు సవాల్ గా మారింది. మట్కా ఆడేందుకు చీటీలపై నంబర్లు రాసినప్పుడు పోలీసులకు పట్టుపడేవారు. ఇటీవల ఎడపల్లి మండలంలో మట్కా ఆడుతున్న ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారు. మట్కా ఆడుతున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. జనవరి నుంచి ఎనిమిది నెలల్లో బోధన్ డివిజన్ లోని ఎడపల్లి మండలంలో మాత్రమే రెండు కేసులు నమోదయ్యాయి. బోధన్ రూరల్, నవీపేట్, రెంజల్ మండలాల్లో మాత్రం ఎలాంటి కేసులు చేయలేదు. పేకాట కేసులు మాత్రం 12 నమోదయ్యాయి.