భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ కమాండర్ చనిపోయాడు. ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం... సుక్మా జిల్లా పోలంపల్లి పీఎస్ పరిధిలోని అడవిలో మావోయిస్టులు సమావేశం అయ్యారని సమాచారం అందడంతో డీఆర్‌జీ బలగాలు కూంబింగ్ చేపట్టారు. భద్రతాబలగాలను చూసిన మావోయిస్టులు ఫైరింగ్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి.
మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ అడవుల్లోకి పారిపోయారు. కాల్పులు ఆగిపోయిన తర్వాత భద్రతాబలగాలు ఘటనాస్థలాన్ని పరిశీలించగా.. ఓ మావోయిస్ట్ డెడ్‌బాడీ, ఆయుధం దొరికాయి. మృతుడు పీఎల్‌జీఏ ప్లటూన్ నంబర్ 1 సెక్షన్ కమాండర్ ముచాకే కైలాశ్‌గా గుర్తించారు. ఇతడిపై రూ.5 లక్షల రివార్డు ఉందని, మందుపాతరలు అమర్చడం, పేల్చడంతో ఎక్స్‌పర్ట్ అని, ఇతడిపై ఇన్‌ఫార్మర్ల పేరుతో పలువురిని హత్య కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్ట్ ముచాకే కైలాశ్ సుక్మా జిల్లా చింతలనార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పూలన్‌పాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
కాంకేర్‌లో ముగ్గురు మావోయిస్టులు సరెండర్
మావోయిస్ట్ పార్టీకి చెందిన ముగ్గురు శనివారం రాత్రి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. జిల్లా పరిధిలోని పర్తాపూర్ ఏరియా కమిటీకి చెందిన రాధికా కుంజాం, సందీప్ కడియాం, రైనూ పద్దాం లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న పర్తాపూర్ ఎస్సై రామేశ్వర్ చతుర్వేది తన సిబ్బందితో కలిసి అడవిలోకి వెళ్లారు. లొంగిపోయేందుకు సిద్ధమైన ముగ్గురు మావోయిస్టులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం వారిని పర్తాపూర్ స్టేషన్‌కు తరలించారు. లొంగిపోయిన మావోయిస్టులు రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఒక 303 రైఫిల్‌ను పోలీసులకు అప్పగించారు.
