రేగోడ్/అల్లాదుర్గం/మెదక్ టౌన్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలని, బస్తాకు 41కేజీల కంటే ఎక్కువ తూకం వేసినా, తరుగు పేరిట కట్‌చేస్తే చర్యలు తీసుకుంటామని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ హెచ్చరించారు. రేగోడ్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, ట్యాబ్ ఎంట్రీని పరిశీలించారు. అంతకుముందు అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామంలో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
చేర్యాల : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో వడ్ల కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మక్కలు, వరి ధాన్యం తరలింపులో జాప్యం జరుగొద్దని సిబ్బందికి సూచించారు.
దొడ్డు రకం ధాన్యం తీసుకోవాలి
వనపర్తి : జిల్లాలోని రైస్ మిల్లర్లు సన్న రకంతో పాటు దొడ్డు రకం వరి ధాన్యాన్ని కూడా తప్పనిసరిగా దింపుకొని ప్రభుత్వానికి సహకరించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో రబీ సీజన్ 2025–-26 ధాన్యం కొనుగోళ్లపై మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.
రైతులను ఇబ్బంది పెడితే చర్యలు
తుంగతుర్తి : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
