- మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లాలో దిగ్విజయంగా జరుగుతున్నట్లు మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శనివారం ఐడీవోసీ ఆఫీస్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. మెదక్ ఆర్డీవో రమాదేవి, అడిషనల్ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మెదక్, రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్లు రాధిక, లావణ్య, వైస్ చైర్‌పర్సన్ దొంతి నరేశ్‌గౌడ్, నబిత, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ముందుగా వివిధ శాఖల ద్వారా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతం వరకు కార్యక్రమాలు అమలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో గ్రామసభలు నిర్వహించి శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసి అమలు చేస్తున్నామన్నారు.
