మెదక్ టౌన్, వెలుగు : పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి వదినను మోసం చేసిన మరిదికి మెదక్ జిల్లా సెషన్స్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిచింది. ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని వివరాల ప్రకారం.. పాపన్నపేట పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఆరేళ్ల కింద అదే గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఏడాదిన్నర కింద ఆమె భర్త కరెంట్ షాక్‌తో చనిపోయాడు. అప్పటి నుంచి అత్తగారింట్లోనే ఉంటోంది.
ఈ క్రమంలో సదరు మహిళ చిన్నమరిది ధరావత్ సురేశ్(26) పెళ్లిచేసుకొని పిల్లలను చూసుకుంటానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. నెల కింద తనను పెళ్లిచేసుకోవాలని అడగగా ముఖం చాటేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా సాక్షాధారాలను కోర్టుకు సమర్పించగా.. పరిశీలించిన జడ్జి లక్ష్మీశారద మంగళవారం తీర్పు ఇచ్చారు.
