మేడారం మహాజాతరలో అపూర్వ గట్టం.. ఇవాళ గద్దెపైకి సమ్మక్క

మేడారం మహాజాతరలో అపూర్వ గట్టం.. ఇవాళ గద్దెపైకి సమ్మక్క

 

మేడారం మహాజాతరలో సమ్మక్క రాక ఒక అపూర్వఘట్టం. ఈ వేడుకను ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. గిరిజన పూజారులు గురువారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకువస్తారు. ఈ వేడుక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయమే మొదలయ్యింది గిరిజన పూజారులు ఉదయం 5.30 గంటలకు వనం గుట్టలోని అడవిలోకి వెళ్లి కంకవనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. మేడారంలోని సమ్మక్క గుడి నుంచి వడెరాల(కొత్త కుండలు)ను తెచ్చి గద్దెలపైకి చేరుస్తారు.

అనంతరం కుంకుమ భరిణె రూపంలోని సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం మధ్యాహ్నం మూడు గంటలకు చిలకలగుట్టపైకి వెళ్తుంది. ఆ సమయంలో సమ్మక్క రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. దీంతో చిలుకలగుట్ట ప్రాంతంలో ఒకరకమైన ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంటుంది. ప్రధాన పూజారి కక్కెర కృష్ణయ్య గుట్ట పైనుంచి కుంకుమభరిణె రూపంలోని అమ్మవారిని తీసుకొస్తారు.  ప్రధాన పూజారి ఒక్కరే గుట్టపైకి నడుచుకుంటూ వెళ్లి అక్కడ రహస్య ప్రదేశంలో ఉన్న సమ్మక్క వద్ద సుమారు మూడు గంటల పాటు పూజలు చేస్తారు.

 పూజారిపై దేవత పూనిన వెంటనే కుంకుమ భరిణె రూపంలోని అమ్మవారిని తీసుకొని అతివేగంగా గుట్ట పైనుంచి కిందికి వస్తారు. సమ్మక్క ఆగమనానికి సూచనగా  జిల్లా ఎస్పీ  ‌‌ఏకే 47తో గాలిలోకి కాల్పులు జరుపుతారు. జిల్లా కలెక్టర్‌‌‌‌, ఇతర అధికార యంత్రాంగం అంతా చిలుకలగుట్ట కిందే ఉంటారు. సమ్మక్క ఎదుర్కోళ్ల కార్యక్రమానికి 500 మందికి పైగా పోలీసులను నియమించారు. రోప్‌‌‌‌ పార్టీని కూడా ఏర్పాటుచేశారు. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు ములుగు జిల్లా పోలీస్‌‌‌‌ శాఖ ప్రకటించింది.