మేడ్చల్‌ లో ఉగ్ర లింక్ కలకలం..పాకిస్తాన్ ఐఎస్‌ఐతో టచ్‌లో ఉన్న జావెద్ ఖాన్ అరెస్ట్ 

మేడ్చల్‌ లో ఉగ్ర లింక్ కలకలం..పాకిస్తాన్ ఐఎస్‌ఐతో టచ్‌లో ఉన్న జావెద్ ఖాన్ అరెస్ట్ 
  • మేడ్చల్ హోటల్‌లో వెయిటర్​గా పనిచేస్తున్న యూపీకి చెందిన వ్యక్తి 
  • ప్రముఖుల వివరాలు ఉగ్రవాదులకు చేరవేసినట్లు అనుమానం 
  • నకిలీ పిస్టల్స్‌తో రీల్స్.. ఉగ్రవాద శిక్షణకు సిద్ధమైన యువకుడు
  • రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్.. దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్​సిటీ/ మేడ్చల్ వెలుగు: మేడ్చల్ జిల్లాలో ఉగ్రలింకుతో ఒక్కసారిగా కలకలం రేగింది. పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లు, ఉగ్రవాద ముఠాతో సంబంధాలున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడంతో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు ఉలికిపడ్డాయి. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన జావెద్ ఖాన్ ఫిబ్రవరిలో మేడ్చల్‌కు వచ్చి ముబారక్ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు.

జావెద్ ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ తుపాకులతో చేసిన రీల్స్ చేయడంతో పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ సానుభూతిపరులు రాణా హుస్సేన్, హబీబ్ అతనితో కాంటాక్ట్‌లోకి వచ్చారు. వీరికి పాక్‌లోని ఐఎస్‌ఐ తీవ్రవాది షెహబాద్‌తో ప్రత్యక్ష  సంబంధాలున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ముఠా జావెద్‌ను తమ గ్రూపులోకి లాగేందుకు ప్రయత్నించగా, వాడు నిరంతరం వారితో టచ్‌లో ఉన్నాడు. తాను పాకిస్తాన్ వచ్చి ఉగ్రవాద శిక్షణలో పాల్గొంటానని మాట్లాడాడు. పాక్ ఉగ్రవాదులు పెట్టిన పరీక్షలో భాగంగా, జావెద్ కొంతమంది వీఐపీల సమాచారంతో పాటు దేశ భద్రతకు సంబంధించిన విషయాలను వారికి షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఉగ్రవాదంపై ఆకర్షితుడైన జావెద్‌ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతడికి అసలైన తుపాకులు సరఫరా చేస్తామని ఐఎస్‌ఐ సానుభూతిపరులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. నిందితుడు వాయిస్ కాల్స్, చాటింగ్ ద్వారా వారితో టచ్‌లో ఉన్నట్లు ఆధారాలు  లభించినట్లు తెలుస్తోంది. పోలీసులు, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రతి అంశాన్ని లోతుగా విచారిస్తున్నాయి. జావెద్ డిలీట్ చేసిన ఇన్‌ఫర్మేషన్‌పై ఆరా తీస్తున్నారు.

3పాక్‌ ఉగ్రవాదితో మాట్లాడినట్లు, ఆయుధాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నించినట్లు విచారణలో బయటపడింది. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్లు, వాయిస్ కాల్స్, స్క్రీన్‌షాట్లను పరిశీలిస్తున్నారు. నిందితుడి వద్ద నుంచి రెండు నకిలీ పిస్టల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జావెద్‌ను అరెస్టు చేసిన మేడ్చల్ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.