మూసీ రివర్‌‌‌‌‌‌‌‌ఫ్రంట్ డీపీఆర్‌‌‌‌‌‌‌‌ ను ఆపండి: మేధా పాట్కర్

మూసీ రివర్‌‌‌‌‌‌‌‌ఫ్రంట్ డీపీఆర్‌‌‌‌‌‌‌‌ ను ఆపండి: మేధా పాట్కర్

 

  • ముందు బాధిత ప్రజలు, మూసీ ఉద్యమ కార్యకర్తలతో సంప్రదింపులు జరపండి
  • సీఎం  రేవంత్​, రాహుల్ గాంధీకి మేధా పాట్కర్ విజ్ఞప్తి
  • భూసేకరణ చట్టానికి 2017 లో తెలంగాణ ప్రభుత్వం చేసిన సవరణలు పేదలకు శాపంగా మారాయని ఆవేదన

హైదరాబాద్​, వెలుగు: మూసీ రివర్‌‌‌‌‌‌‌‌ఫ్రంట్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రాజెక్టు పేరుతో సామాన్యుల ఇళ్లను కూల్చివేయడం, నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ చేపట్టడాన్ని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, మూసీ జన ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ తప్పుపట్టారు. బుధవారం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీని కాపీలను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, జైరామ్ రమేశ్​, మీనాక్షి నటరాజన్‌‌‌‌‌‌‌‌కు పంపినట్లు ఆమె తెలిపారు. మూసీ జన ఆందోళన్ (ఎంజేఏ) చేపట్టిన పోరాటానికి తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

ఈ నెల 13న తాజ్ కృష్ణ హోటల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించ తలపెట్టిన మూసీ రివర్‌‌‌‌‌‌‌‌ఫ్రంట్ డీపీఆర్ విడుదల కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేయాలని మేధా పాట్కర్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఇళ్లు కోల్పోయే పేదలు, శ్రామికులు, పర్యావరణ నిపుణులతో ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు. మూసీ రివర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ పంపిన ఆహ్వానాన్ని ప్రస్తావిస్తూ.. ఇది కేవలం ఉన్నత వర్గాల కోసం చేస్తున్న కృత్రిమ సంప్రదింపులు మాత్రమేనని, క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుకకు అక్కడ చోటు లేదని ఆమె విమర్శించారు. 

యూపీఏ ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టానికి 2017లో తెలంగాణ ప్రభుత్వం చేసిన సవరణలు రైతులకు, పేదలకు శాపంగా మారాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని మేధాపాట్కర్​ డిమాండ్​చేశారు.