కరీంనగర్(సైదాపూర్), వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒక్కో మండలాన్ని ఒక్కో మెడికల్ కాలేజీ దత్తత తీసుకున్నాయని, ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండల కేంద్రంలో విశాల సహకార పరపతి సంఘం లిమిటెడ్ భవనంలో సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి సర్‌లో ఓట్ల తొలగింపు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గ్రామాల్లో వచ్చే వర్షాకాలంలో ప్లాంటేషన్ చేయాలని, ధాన్యం కొనుగోలులో సమస్యలు రాకుండా ఐదుగురు రైతులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. తనను గెలిపిస్తే హుస్నాబాద్ నియోజకవర్గం అంటే గౌరవం పెంచుతానని చెప్పానని, గౌరవాన్ని పెంచేలా పనులు చేస్తున్నానని వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ , మాజీ సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.

