- ఖైదీలకు రెగ్యులర్ స్క్రీనింగ్: మంత్రి దామోదర
- చంచల్‌గూడ జైలులో మెడికల్ క్యాంప్ ఓపెన్
- కొండాపూర్‌లోనూ 41 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్‌కు శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. గురువారం ఆయన ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా చంచల్‌గూడ జైలులో ఏర్పాటు చేసిన మూడు రోజుల మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ఖైదీల కోసం ప్రతి మూడు నెలలకోసారి స్పెషలిస్ట్ డాక్టర్లతో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని వెల్లడించారు.
హెచ్‌ఐవీ, టీబీ స్క్రీనింగ్‌తో పాటు ఇతర డయాగ్నస్టిక్ పరీక్షలు రెగ్యులర్ గా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జైళ్లను ఆశ్రమాల తరహాలో తీర్చిదిద్దుతున్న అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అంతకుముందు కేబుల్ బ్రిడ్జ్ వద్ద జరిగిన ఎయిడ్స్ అవేర్‌నెస్ మానవహారంలో దామోదర పాల్గొన్నారు. ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్ష చూపడం నేరమని, డ్రగ్స్ వల్ల కూడా హెచ్‌ఐవీ వ్యాపించే ముప్పు ఉందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 127 టెస్టింగ్ సెంటర్లు, 33 ఏఆర్టీ సెంటర్ల ద్వారా 1.14 లక్షల మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం
కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో రూ. 41 కోట్లతోనిర్మించనున్న 100 బెడ్ల క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ) నిర్మాణానికి ఎమ్మెల్యే అరికపుడి గాంధీతో కలిసి మంత్రి దామోదర శంకుస్థాపన చేశారు. ఐటీ కారిడార్ లో మారిన జీవనశైలి కారణంగా పెరుగుతున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. శంకుస్థాపన అనంతరం హాస్పిటల్ లోని డయాగ్నస్టిక్ హబ్ ను సందర్శించి పేషెంట్లతో మాట్లాడారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆదుకునేందుకు ప్రభుత్వం సమగ్ర ట్రామా కేర్ పాలసీని అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు.
జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి అన్ని వసతులతో 109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే బాధితుల వద్దకు చేరుకునేలా 108 అంబులెన్స్ ల సంఖ్యను పెంచుతున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 31 క్రిటికల్ కేర్ బ్లాకులు మంజూరు చేయగా.. ఇప్పటికే 8 జిల్లాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి దామోదర స్పష్టం చేశారు.
