సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి వైద్య విద్యార్థిని బలైంది. గాంధీ మెడికల్ కాలేజీలో బీఎస్సీ ఓటీటీ (BSc OTT) సెకండ్ ఇయర్ చదువుతోంది పల్లవి గౌడ్. కొద్ది రోజుల క్రితం ఆమెకు ఛాతికి సంబంధించిన సమస్య రావడంతో.. చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలోనే చేరింది. అయితే, పల్లవికి వైద్యులు చేసిన మొదటి సర్జరీ విఫలమైంది. దాంతో వైద్యులు ఆమెకు రెండోసారి కూడా సర్జరీ నిర్వహించారు.
అయితే రెండోసారి సర్జరీ చేసినప్పటికీ పల్లవికి బ్లీడింగ్ అవుతూనే ఉందని... ఆపరేషన్ సమయంలో డాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె కళ్లముందే ప్రాణాలు విడిచిందని ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా... కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు, కనీసం డెడ్ బాడీని కూడా అప్పగించడం లేదని పల్లవి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వైద్యులు పల్లవి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘోర ఘటనపై పల్లవి కుటుంబ సభ్యులు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తోటి విద్యార్థిని మృతి చెందడంతో గాంధీ మెడికల్ కాలేజీలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
