మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేఎంసీ హెచ్ఓడీపై వేటు వేసింది. ప్రీతిని వేధించిన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను మందలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఇటీవల ఎంజీఎంలో త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అనస్థీషియా విభాగం హెచ్ఓడీ డాక్టర్ నాగార్జునరెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన్ను భూపాలపల్లి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల అనస్థీషియా విభాగం హెచ్ఓడీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఈ కేసులో ఇప్పటికే సైఫ్‌ను పోలీసులు కస్టడీ లోకి తీసుకున్నారు. ఖమ్మం జైలు నుంచి వరంగల్ కు తీసుకువచ్చారు. సైఫ్‌ను నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. సైఫ్‌ను వరంగల్ మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
