మీర్‌పేట్, వెలుగు: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ మందమల్లమ్మ చౌరస్తా వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంగూడకు చెందిన సభావత్ సునీల్(35) ఆటో సాగర్ హైవేపై మందమల్లమ్మ చౌరస్తా వద్ద మొరాయించి ఆగిపోయింది.
గుర్రంగూడకు చెందిన సభావతి ప్రసాద్(26), సభావత్ సంతోష్(35) వారి ఆటోలతో సంఘటన స్థలానికి వచ్చారు. ఈ సమయంలో ఎల్‌బీనగర్ నుంచి సాగర్ హైవే వైపు వస్తున్న టిప్పర్ లారీ.. ఆటో పక్కన నిల్చున్న సంతోష్, సునీల్‌ను ఢీకొట్టింది.
సంతోష్‌కు తీవ్ర గాయాలై స్పాట్లో మృతిచెందాడు. సునీల్‌కు కూడా గాయాలు కావడంతో హస్తినాపురంలోని అగస్త్య ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను వనపర్తి జిల్లా ఆత్మకూర్‌కు చెందిన జవాల సురేశ్(38)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
