కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడలో ఈనెల 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను సక్సెస్ చేసేందుకు నిర్వహణ కమిటీ సభ్యులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఇరిగేషన్, సివిల్ సప్లైస్ శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది హుజూర్నగర్లో నిర్వహించిన మెగా జాబ్ మేళా అపూర్వ స్పందన వచ్చిందని, సుమారు 3 వేల మందికి ఉద్యోగాలు అందించిన స్ఫూర్తితో, అంతకంటే భారీ స్థాయిలో కోదాడలో ఈ మేళాను చేపడుతున్నట్లు తెలిపారు.
కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలతో పాటు పొరుగున ఉన్న ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు విస్తృత అవకాశాలు కల్పించేలా 200 నుంచి 250 కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా, ప్రచార మాధ్యమాల ద్వారా జాబ్ మేళా వివరాలు ప్రతి అర్హుడికి చేరేలా చూడాలని, అభ్యర్థుల నమోదు నుంచి ఇంటర్వ్యూలు, పార్కింగ్, తాగునీరు, హాజరయ్యే ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయం కల్పించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పాల్గొన్నారు.
