గోదావరిఖని, వెలుగు : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన మెగా లోక్ అదాలత్‌లో మొత్తం 8,120 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై విచారణలో, కోర్టు పరిధిలో ఉన్న కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. మొత్తం 84 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు రూ.61 లక్షలు అందజేశామని, ఇ-పెట్టి కేసులు 2,537 కేసులు, 4,892 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు.
లోక్ అదాలత్ ద్వారా ఇ-పెట్టి కేసులు, ట్రాఫిక్, ఎక్సైజ్, డ్రంక్ అండ్ డ్రైవ్, తదితర స్వల్ప చట్టపరమైన కేసులు వేగంగా పరిష్కరించగా, పెండింగ్ కేసుల పరిష్కారంతో ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అయిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసుల పరిష్కారానికి సహకరించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో ఈ విజయవంతమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.
