KFC, పిజ్జా హట్ విలీనం.. ఇక మెక్‌డొనాల్డ్స్, డొమినోస్‌కు గట్టి పోటీ

KFC, పిజ్జా హట్ విలీనం.. ఇక మెక్‌డొనాల్డ్స్, డొమినోస్‌కు గట్టి పోటీ

భారతీయ ఫాస్ట్ ఫుడ్ రంగంలో సంచలన డీల్ నమోదైంది. ప్రముఖ ఫుడ్ బ్రాండ్లు KFC, పిజ్జా హట్‌లను నిర్వహిస్తున్న దేవయాని ఇంటర్నేషనల్, శఫైర్ ఫుడ్స్ ఇండియా కంపెనీలు విలీనం కాబోతున్నట్లు ప్రకటించాయి. సుమారు 934 మిలియన్ డాలర్ల డీల్ అంటే భారత కరెన్సీలో సుమారు రూ.8వేల 406 కోట్లు విలువైన ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో అతిపెద్ద ఫాస్ట్ ఫుడ్ నెట్‌వర్క్ ఏర్పడనుంది.

ఈ మెగా డీల్‌లో భాగంగా.. శఫైర్ ఫుడ్స్‌కు చెందిన ప్రతి 100 షేర్లకు గానూ.. దేవయాని ఇంటర్నేషనల్ 177 షేర్లను జారీ చేయనుంది ఇన్వెస్టర్లకు. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు కలిపి భారత్, విదేశాల్లో కలిపి 3వేల కంటే ఎక్కువ అవుట్‌లెట్లను నడుపుతున్నాయి. వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వర్ల్డ్ నిర్వహిస్తున్న మెక్‌డొనాల్డ్స్, డొమినోస్ ఫ్రాంచైన్ నడిబిస్తున్న జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ వంటి దిగ్గజాలతో పోటీ పడేందుకు ఈ మెర్జర్ డీల్ దోహదపడనుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం భారతీయ ఫాస్ట్ ఫుడ్ మార్కెట్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో తాజా డీల్ జరగటం ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల నిర్వహణ భారం పెరిగింది. అలాగే దేశంలో మారుతున్న పరిస్థితులతో ఫుడ్ లవర్స్ అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం కారణంగా సేమ్-స్టోర్ అమ్మకాలు తగ్గాయి. ఈ పరిస్థితుల కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో దేవయాని రూ.21 కోట్ల 90లక్షలు, శఫైర్ రూ.12కోట్ల 77లక్షలు నికర నష్టాన్ని నమోదు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత డీల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఈ రెండు సంస్థలు ఒక్కటి కావడం వల్ల ఏడాదికి సుమారు రూ.189 కోట్ల నుంచి రూ.202 కోట్ల వరకు అదనపు లాభాలు వస్తాయని అంచనాలు ఉన్నాయి. రెండు బ్రాండ్స్ ఒకే గొడుగు కిందకు రావడం వల్ల నిర్వహణ వ్యయం తగ్గి, కార్యకలాపాలు లాభదాయకంగా మారుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.