- పబ్లిక్ పరీక్షలు, ఫెసిలిటీస్‌పై చర్చ
- రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ కాలేజీల్లో పండుగ వాతావరణం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) సక్సెస్ అయింది. శుక్రవారం 430 సర్కారు జూనియర్ కాలేజీల్లో నిర్వహించిన రెండో పీటీఎంకు 50 వేల మందికి పైగా తల్లిదండ్రులు హాజరయ్యారు. తమ పిల్లల విద్యా ప్రగతి, హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధతపై లెక్చరర్లతో చర్చించారు. ఈ సందర్భంగా కాలేజీల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.
వసతుల కోసం రూ. వంద కోట్లకు పైగా ఖర్చు..
గత రెండేండ్లలో ఇంటర్ విద్యలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను పేరెంట్స్‌కు ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు వివరించారు. స్టేట్ వైడ్‌గా కాలేజీల మరమ్మతులు, గ్రీన్ బోర్డుల కోసం రూ.56.16 కోట్లు, మరో 41 కాలేజీల రెనోవేషన్ కోసం రూ.10.25 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అదనంగా 300 కాలేజీల్లో మరుగుదొడ్లు, తరగతి గదుల నిర్మాణం కోసం రూ.49.63 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
సైన్స్ ల్యాబ్‌ల కోసం ప్రతి కాలేజీకి రూ.50 వేలు, క్రీడా సామగ్రికి రూ.10 వేల చొప్పున నిధులిచ్చినట్టు వివరించారు. ప్రతి జూనియర్ కాలేజీలో రెండు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, డిజిటల్ ప్రొజెక్టర్లు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించిన విషయాన్ని తెలియజేశారు. ‘ఫిజిక్స్ వాలా’, ‘ఖాన్ అకాడమీ’ సహకారంతో విద్యార్థులకు జేఈఈ, నీట్, క్లాట్‌లాంటి పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.
స్టూడెంట్ల హెల్త్ అండ్ సేఫ్టీపై ఫోకస్
కాలేజీల్లో స్టూడెంట్ల హెల్త్, సేఫ్టీపై ప్రత్యేక శ్రద్ధపెట్టినట్టు పేరెంట్స్‌కు ప్రిన్సిపాల్స్ వివరించారు. సీసీ కెమెరాలు, అగ్నిమాపక భద్రతా చర్యలను వెల్లడించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం ‘టెలి మానస్’ (14416) హెల్ప్‌లైన్, కౌన్సిలింగ్, ‘హెల్ప్’ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నట్టు తెలిపారు. పూర్వ విద్యార్థుల విజయాలను ప్రదర్శించేలా ‘వాల్ ఆఫ్ ఫేమ్’ను ఏర్పాటు చేసిన విషయాన్ని వివరించారు. కాగా, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మెగా పీటీఎంను సక్సెస్ చేసిన ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్‌ను ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య అభినందించారు.
