సీఎం జగన్‌కు ధన్యవాదాలు

సీఎం జగన్‌కు ధన్యవాదాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. కర్నూల్ ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూల్ ఎయిర్‌పోర్ట్‌కు పెట్టడం చాలా గొప్ప విషయమని చిరంజీవి అన్నారు.

ననగరానికి 50 కిలోమీటర్ల దూరంలో  ఓర్వకల్లు పరిధిలో నిర్మించిన కొత్త ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఈనెల 28 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న కర్నూలు ఎయిర్ పోర్టును కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌తో కలసి సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. తొలుత ఎయిర్ పోర్టు టెర్మినల్ బిల్డింగ్ వద్ద దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌ను రిబ్బన్ కట్ చేసి విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎయిర్ పోర్టు ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఇండిగో సంస్థ ఈనెల 28 నుంచి కర్నూలు టూ విశాఖ, చెన్నై, బెంగళూరుకు సర్వీసులు నడపనుంది. ఈ ఎయిర్‌పోర్టును 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో నిర్మించారు. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న లైసెన్స్‌ జారీ చేయగా.. బీసీఏఎస్‌ సెక్యూర్టీ క్లియరెన్స్‌ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు సరిపడా పార్కింగ్‌తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు.