భేల్ పూరీతో అమెరికన్లను లొట్టలేయిస్తున్న మెహర్ వాన్

భేల్ పూరీతో అమెరికన్లను లొట్టలేయిస్తున్న మెహర్ వాన్

మంచి జీవితం కావాలని, గొప్పగా బతకాలని కోరుకోనివాళ్లు ఉండరు. మెహర్​వాన్ ఇరానీ కూడా అందరిలానే కెరీర్, జీవితం గురించి పెద్ద పెద్ద కలలు కన్నాడు​. కానీ, అవేమీ నిజం కాలేదు. అలాగని అక్కడే ఆగిపోలేదు. చెఫ్​గా మారాడు. తనకు ఎంతో ఇష్టమైన భేల్​పూరీని నమ్ముకొని ఇండియన్ స్ట్రీట్​ఫుడ్ బిజినెస్ పెట్టాడు. అది కూడా అమెరికాలో. భారతీయ శ్నాక్స్​లోని మసాలా ఘాటు, రుచికి అమెరికన్లు ఫిదా అయ్యారు. దాంతో ఇతను నడుపుతున్న ‘ఛాయ్​పానీ’ రెస్టారెంట్​ ఈ ఏడాది అమెరికాలో ఫేవరెట్ రెస్టారెంట్​గా నిలిచింది. ‘చిన్నప్పుడు అమ్మ దగ్గర నేర్చుకున్న భేల్​పూరీ నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది’ అంటున్న మెహర్​వాన్  గురించి...

ఇండియన్ స్ట్రీట్​ఫుడ్​తో అమెరికావాళ్లను లొట్టలేయిస్తున్న మెహర్​వాన్​ సొంతూరు మహారాష్ట్రలోని అహ్మద్​నగర్. అతనికి భేల్ పూరీ అంటే ఎంత ఇష్టమో, అమెరికాలో చదవడం అంటే కూడా అంత ఇష్టం. దాంతో 19 ఏండ్లకు ఎంబిఏ కోసం అమెరికా వెళ్లాడు. అయితే తనకు ఎంతో ఇష్టమైన భేల్ పూరీతో తన కలల జీవితం మొదలవుతుందని ఊహించలేదు అతను. 

ఆర్థిక మాంద్యంతో....

ఎంబీఏ పూర్తయ్యాక  శాన్​ఫ్రాన్సిస్కోలో ఒక ఆటో ఇండస్ట్రీలో చేరాడు మెహర్​వాన్. జీవితం హాయిగా గడిచిపోతున్న టైంలో అనుకోని మలుపు.  అమెరికాలో 2009లో ఆర్థికమాంద్యం దెబ్బకు జాబ్ పోవడంతో కుటుంబంతో సహా యాష్​విల్లేకు వచ్చాడు. ఏం చేయాలో తెలియని ఆ టైంలో అతనికి ఇండియన్​  స్ట్రీట్ ఫుడ్ అమ్మాలనే ఆలోచన వచ్చింది. ఇదే విషయం  భార్య మోలికు చెప్తే ‘కష్ట సమయాల్లోనే రిస్క్​ తీసుకోవాలి. ఒకవేళ సక్సెస్ కాకున్నా కోల్పోయేది ఏం లేదు’ అని ఆమె సపోర్ట్ చేసింది. అలా... ‘ఛాయ్​పానీ’ పేరుతో రెస్టారెంట్ పెట్టాడు. అప్పట్లో వాళ్లు ఉన్నచోట అంతా అమెరికన్లే. మూడు నాలుగు భారతీయ కుటుంబాలు మాత్రమే ఉండేవి. అయినా బిజినెస్ నడుస్తుందని నమ్మాడు మెహర్​వాన్. ఇప్పుడు అదే నిజమైంది. 

కుటుంబం నుంచి...

మెహర్​వాన్​కు అన్నిరకాల ఇండియన్ స్ట్రీట్​ఫుడ్ తయారీ తెలియడానికి కారణం వాళ్ల ఫ్యామిలీనే.  అమ్మ  హిందువు, నాన్న పార్సీ. దాంతో వాళ్ల ఇంట్లో పండుగలకు హిందూ, పార్సీ వంటకాలు   వండేవాళ్లు. అమ్మ చేసే కొత్తరకం రెసిపీలను బాగా గమనించేవాడు. అలా చిన్నప్పటి నుంచే వంట మీద  ఇష్టం పెంచుకున్నాడు మెహర్​వాన్​. 

బెస్ట్ రెస్టారెంట్ ఎలాగంటే... 

ఛాయ్​ పానీ అమెరికాలో బెస్ట్ రెస్టారెంట్ అవ్వడానికి కొన్ని కారణాలున్నాయి. వాటిలో కొన్ని... ‘గివ్ బ్యాక్​’ ఫ్రైడేస్​. ప్రతి శుక్రవారం వచ్చిన డబ్బుని కమ్యూనిటీ డెవలప్​మెంట్ కోసం ఖర్చుచేస్తాడు మెహర్​వాన్. అక్కడి భారతీయ మహిళల్ని కలిసి కొత్త రెసిపీల గురించి తెలుసుకుంటాడు. ప్రతి ఏడాది ఇండియాకు వచ్చి చిన్నప్పుడు అతను శ్నాక్స్​ తిన్న ప్లేస్​లకు వెళ్తాడు. పూణెలోని ఎంజీ రోడ్డులో వడపావ్, అహ్మద్​నగర్​లో సమోసా, కల్యాణ్​లో భేల్​పూరీ తింటాడు. ఇప్పటికీ వాటి రుచి అలానే ఉందా? అనేది  తెలుసుకునేందుకు అతను ఇలా చేస్తాడు. అంతేకాదు రెండేండ్లకు ఒకసారి తన టీమ్​ని   సొంత ఖర్చుతో ఇండియాకు పంపిస్తాడు కూడా. ఛాయ్​పానీ రెస్టారెంట్​కి అనుబంధంగా ఈమధ్యే ‘బోటివాలా’ మొదలుపెట్టాడు మెహర్​వాన్​. ఇందులో గ్రిల్డ్ రెసిపీలు, ఇరానియన్ కెఫెల్లో దొరికే బన్ మస్కాకూడా అమ్ముతున్నాడు.