- వాహనదారుల అసహనం
మెహిదీపట్నం, వెలుగు: మెహిదీపట్నంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్మార్ట్ స్కైవాక్ పనులు, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై సీసీటీవీ కెమెరా పోల్స్ ఏర్పాటు పనుల నేపథ్యంలో మే 24, 25 తేదీల్లో (సాయంత్రం 4:00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:00 గంటల వరకు) ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చిన రోజే (ఆదివారం) పోలీసులు ఈ ప్రకటన విడుదల చేయడంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. సమాచారాన్ని కనీసం ఒక్క రోజు ముందే చెప్పి ఉంటే.. తాము ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునేవాళ్లమని వాపోయారు.
మళ్లింపులు ఇలా..
- మాసబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ, ఎస్.డి కంటి ఆసుపత్రి మీదుగా రేతిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నం. 2 , 3 (అజీజియా మసీదు) వద్ద మెరాజ్ కేఫ్ మీదుగా కుడి వైపునకు మళ్లిస్తున్నారు. ఈ వాహనాలు పిల్లర్ నెం. 15 వద్ద మళ్లీ సాధారణ మార్గంలోకి ప్రవేశించవచ్చు.
- టోలిచౌకి, లంగర్‌హౌస్, అత్తాపూర్ల నుంచి మాసబ్ ట్యాంక్ వెళ్లే వాహనాలను పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం. 23 వద్ద యూ-టర్న్ చేయించి వ్యతిరేక దిశలో పంపి, ఆపై పిల్లర్ నం. 4, 5 వద్ద సాధారణ మార్గంలోకి అనుమతిస్తున్నారు.
- మాసాబ్ ట్యాంక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే వాహనాలను ఎస్.డి కంటి ఆసుపత్రి వద్ద లక్ష్మీనగర్ రాంప్ (పిల్లర్ నం. 77) వైపునకు, ఎయిర్పోర్ట్ నుంచి మెహిదీపట్నం వచ్చే వాహనాలను లక్ష్మీనగర్ రాంప్ (పిల్లర్ నం. 88) వద్దకు మళ్లిస్తున్నారు. వాహనదారులు తాజా అప్‌డేట్ల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ఫేస్బుక్, ఎక్స్ ఖాతాలను ఫాలో అవ్వాలని, ఏదైనా అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్: 9010203626 ను సంప్రదించి జాయింట్ సీపీ సూచించారు.
