మెంటల్ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాలి: మిథాలీ రాజ్

మెంటల్ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాలి: మిథాలీ రాజ్

హైదరాబాద్: వచ్చే ఏడాది న్యూజిలాండ్ లో జరిగే మహిళల వన్డే వరల్డ్ కప్ నకు ఇండియా విమెన్ టీమ్ అర్హత సాధించడంపై వెటరన్ ప్లేయర్ మిథాలీ రాజ్ హర్షం వ్యక్తం చేసింది. లాక్ డౌన్ తో లాంగ్ బ్రేక్ వచ్చిందని చెప్పిన స్టార్ బాటర్.. ప్లేయర్లు మళ్లీ మొదట్నుంచి మొదలుపెట్టాలని తెలిపింది. ‘ట్రెయినింగ్ సెషన్స్ రద్దవడంతో అందరం ఇళ్లకే పరిమితమయ్యాం. ఇంట్లోనే ఉంటూ కొన్ని డ్రిల్స్ చేస్తున్నాం. కమ్ బ్యాక్ చేయడం కొంచెం చాలెంజింగ్ గా ఉంటుంది. టాప్ స్పాట్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టీమ్స్ తో మేం పోటీ పడుతున్నాం. మెంటల్ టఫ్ నెస్ పై ఎక్కువగా శ్రమించాల్సి ఉంది. ముఖ్యంగా వరల్డ్​కప్స్ ఫైనల్ రౌండ్ లో ఒత్తిడిని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాలి. రీసెంట్ గా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లోనూ ఒత్తిడి కారణంగానే మా న్యాచురల్ గేమ్ ఆడటంలో విఫలమయ్యాం. ఇప్పటివరకు ఆడిన మూడు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ లోనూ ఇలాగే జరిగింది’ అని మిథాలీ పేర్కొంది. కరోనా కారణంగా పరిస్థితులు ఎంతగా విషమిస్తున్నాయో చూస్తున్నామని.. చాలా మంది ప్రజలు రోజు వారీ వేతనాలు, ఆహారం, నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది. 2017 వరల్డ్ కప్ తర్వాత అందరూ తమ పెర్ఫామెన్స్ ను గమనించడం మొదలుపెట్టారని.. ఆ టోర్నీ టర్నింగ్ పాయింట్ అని వివరించింది. ఆ ప్రపంచకప్ లో ఇండియా మహిళల జట్టు అద్భుత ఆటతీరుతో ఫైనల్స్ కు చేరింది. అయితే టైటిల్ ఫైట్ లో ఆతిథ్య ఇంగ్లండ్ చేతిలో 9 రన్స్ తేడాతో ఓడిపోయింది.