ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులకు షాకింగ్ విషయం చెప్పింది. కంపెనీ వ్యాపారం స్థిరంగా సాగుతున్నప్పటికీ, AIలో పెట్టుబడులు పెంచుతున్న క్రమంలో భారీగా లేఆఫ్స్ ఉంటాయని ప్రకటించింది. మే 20 నుంచి సుమారు 10 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ కోతలు ఇక్కడితో ఆగిపోవని.. 2026 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందిపై వేటు పడే అవకాశం ఉందనే వార్తలు మెటా వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని లేఆఫ్స్ ఉండవని గ్యారెంటీ ఇవ్వలేమని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంపెనీ నిలదొక్కుకోవాలంటే ఖర్చులను నియంత్రించుకోవాలని, వ్యాపార ప్రాధాన్యతలను బట్టి టీమ్‌లను మార్చాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. కొంతమందికి వేరే విభాగాల్లో అవకాశం కల్పించినప్పటికీ, చాలామంది ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది.
ఈ లేఆఫ్స్‌పై మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగానే ఈ ఉద్యోగాల తొలగింపు జరుగుతోందన్న వార్తలను ఆయన ఖండించారు. AI మౌలిక సదుపాయాల కోసం భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతోందని అంగీకరించారు. తమకు రెండు ప్రధాన ఖర్చులు ఉన్నాయని.. ఒకటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రెండు ఉద్యోగుల జీతభత్యాలని చెప్పారు. ఒకదానిపై ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటే, రెండో దానిపై తగ్గించక తప్పదని జూకర్ బర్గ్ పేర్కొన్నారు.
ముఖ్యంగా కంపెనీని 'డౌన్ సైజ్' చేయడం లేదా పరిమాణాన్ని తగ్గించడం ద్వారా ఎఫీషియన్సీని పెంచుకోవాలని జూకర్ బర్గ్ భావిస్తున్నారు. కంపెనీ ఎదుగుదలతో పాటు దాని సామర్థ్యం మధ్య సమతుల్యత కోసం సరైన సంఖ్యలో ఉద్యోగులను ఉంచుకోవాలని నాయకత్వం నిర్ణయించిందని తెలిపారు. 2026 నాటికి AI పరిశోధనల కోసం దాదాపు 125 నుండి 145 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాలని మెటా లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం మెటాలో ప్రపంచ వ్యాప్తంగా 77వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. భవిష్యత్తు అస్పష్టంగా ఉందని, రాబోయే కొన్నేళ్లలో ఏం జరుగుతుందో తమకే తెలియదని జూకర్ బర్గ్ వ్యాఖ్యానించడం ఉద్యోగుల్లో భయాన్ని పెంచింది. ఈ క్రమంలో కంపెనీ అంతర్గత డేటాను AI ట్రైనింగ్ కోసం వాడుతున్నారని వస్తున్న వార్తలపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద టెక్ దిగ్గజం మెటాలో ఉద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు.
