న్యూఢిల్లీ: టెక్ కంపెనీ మెటా ప్లాట్‌ఫామ్స్ మరోసారి భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోంది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 20శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించే అవకాశం ఉందని రిపోర్ట్స్ వెలువడ్డాయి. మెటాలో గ్లోబల్‌గా 79 వేల మంది పనిచేస్తున్నారు.
తాజా కోతలు జరిగితే, 15–16 వేలకు పైగా ఉద్యోగాలు పోవచ్చు. ఇది 2022–23లో జరిగిన “ఇయర్ ఆఫ్ ఎఫీషియెన్సీ’’ రీస్ట్రక్చరింగ్ తర్వాతి అతిపెద్ద కోత అవుతుంది. ఆ సమయంలో మెటా 11 వేల మందిని తొలగించి, నాలుగు నెలల తర్వాత మరో 10 వేల మందిని ఉద్యోగం నుంచి తీసేశారు.
సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలో ఈ కంపెనీ జనరేటివ్ ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. టాప్ ఏఐ ట్యాలెంట్‌ను ఆకర్షించేందుకు మిలియన్ డాలర్ల ప్యాకేజిని ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా 2028 నాటికి డేటా సెంటర్ల నిర్మాణానికి 600 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని చూస్తోంది. చైనా ఏఐ స్టార్టప్ మానస్‌ను, మోల్ట్‌బుక్ అనే ప్లాట్‌ఫామ్‌ను సొంతం చేసుకుంది.
