సిటీకి ఆరెంజ్ అలర్ట్.. రేపటి నుంచి మూడ్రోజుల పాటు అతి భారీ వానలు 

సిటీకి ఆరెంజ్ అలర్ట్.. రేపటి నుంచి మూడ్రోజుల పాటు అతి భారీ వానలు 

హైదరాబాద్, వెలుగు: రేపటి నుంచి మూడ్రోజుల పాటు గ్రేటర్ సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 17న రాత్రి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు సిటీలో నాన్ స్టాప్​గా వాన పడగా ..  శుక్రవారం కాస్త  తెరిపినిచ్చింది. శనివారం సైతం ఆకాశం మబ్బులు పట్టి ఉన్నప్పటికీ చిరుజల్లులు మాత్రమే కురిశాయి. షేక్ పేట, కుత్బుల్లాపూర్, మియాపూర్, కూకట్​పల్లి ప్రాంతాల్లో సెం.మీలోపు వాన పడింది.

అయితే, అంతకుముందు కురిసిన వర్షాలతో గ్రేటర్ జనానికి ఇంకా ఇబ్బందులు తప్పడం లేదు.  కొన్నిచోట్ల రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు తొలగినప్పటికీ బురదతో వాహదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో 4 రోజుల పాటు గ్రేటర్ లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం మోస్తరుగా, సోమవారం నుంచి మూడ్రోజులు పాటు భారీ వర్షాలుంటాయని పేర్కొంది. సిటీకి సోమవారం ఎల్లో అలర్ట్, మంగళ, బుధవారాల్లో అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్​ను ప్రకటించింది.

జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలి

వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. సిటీలో కురుస్తున్న వానలకు జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలర్ట్​గా ఉన్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బల్దియా హెడ్డాఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్​ను శనివారం ఆమె సందర్శించారు. మేయర్ మాట్లాడుతూ.. భారీ వానలు పడే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప జనాలు బయటికి రావొద్దని సూచించారు.  సిటిజన్లకు ఎలాంటి సమస్య రాకుండా బల్దియా ఏర్పాటు చేసిన 428 మాన్​సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ తో గ్రౌండ్ లెవెల్​లో అలర్ట్​గా ఉన్నామన్నారు. 27 డీఆర్ఎఫ్ టీమ్స్ సైతం 24 గంటల పాటు పనిచేస్తున్నాయన్నారు. అనంతరం మేయర్ ఆమె చాంబర్​లో కమిషనర్ రోనాల్డ్ రోస్​తో సమావేశమయ్యారు. వానలకు డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉందని, నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ కు సూచించారు. 

వానకు తడిసి కూలిన పాత ఇంటి గోడలు 

సికింద్రాబాద్: సనత్​నగర్​పరిధి అల్లావుద్దీన్ కోఠి ఏరియాలో ఉండే  మహ్మద్ గౌస్.. పాత రేకుల ఇంట్లో ఉంటున్నాడు.   ఇంటి గోడలు   వర్షాలకు పూర్తిగా నానడంతో శనివారం ఒక్కసారిగా కూలిపోయాయి. గౌస్, అతడి కుటుంబసభ్యులు బయటికి పరుగులు తీశారు.  బాలానగర్ తహసీల్దార్, అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గౌస్​కుటుంబాన్ని అల్లావుద్దీన్ కమ్యూనిటీ హాల్​లోని పునారావాస కేంద్రానికి తరలించారు. బాధిత కుటుంబానికి రూ.90 వేలు పరిహారం అందజేశారు. 

నిండుకుండలా లక్నాపూర్ చెరువు

పరిగి:పరిగి మండలంలోని లక్నాపూర్ చెరువు నిండుకుండలా మారింది. భారీ వానలకు చెరువు పూర్తిగా నిండటంతో సందర్శకుల తాకిడి పెరిగింది. 

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం: మంత్రి తలసాని శ్రీనివాస్

భారీ వానల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హుస్సేన్​సాగర్  నీటిమట్టం, దిగువకు నీటిని విడుదల చేస్తున్న నాలాను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్​తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఇన్​ ఫ్లో, ఔట్​ ఫ్లో గురించి తెలుసుకున్నారు. మారుతీనగర్, అశోక్​నగర్​లో హుస్సేన్ సాగర్ నాలాపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.