అటు ఎండ.. ఇటు వాన

అటు ఎండ.. ఇటు వాన

హైదరాబాద్/గండిపేట, వెలుగు : సిటీలో మరో రెండ్రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం రాజేంద్రనగర్, డబీర్ పురా, బండ్లగూడ, ఉప్పల్​, ఘాన్సీ బజార్, చార్మినార్, ఆసిఫ్ నగర్, మెహిదీపట్నం, ఎల్ బీనగర్, కోఠి తదితర ప్రాంతాల్లో వాన పడింది. అత్యధికంగా రాజేంద్రనగర్ లో 2.9 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఉదయం  స్కూల్స్, ఆఫీసులకు వెళ్లే టైమ్ లో వాన పడటంతో స్టూడెంట్లు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8 గంటలకు వర్షం కురవగా, వెంటనే 9 గంటలకు ఎండ వచ్చింది. మళ్లీ వెంటనే వాన..  ఆ తర్వాత ఎండ.. ఇలా మంగళవారం సిటీ అంతటా వెదర్ మారుతూనే ఉంది. 

జంట జలాశయాలకు భారీగా వరద


ఎగువ ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షాలు కురవడంతో జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్ సాగర్ 6 గేట్లు, హిమాయత్ సాగర్ 4 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు నీటిని దిగువన ఉన్న మూసీకి పంపుతున్నారు. ఉస్మాన్ సాగర్​కు 2,200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 2,328 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. హిమాయత్ సాగర్​కు 2,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 2,532 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా..  ప్రస్తుతం1786.40గా ఉంది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1761.30 అడుగుల నీరు ఉంది.