తెలంగాణకు వడగండ్ల గండం.. మార్చి 15 నుంచి నాలుగు రోజులు వానలు

తెలంగాణకు  వడగండ్ల గండం.. మార్చి 15 నుంచి  నాలుగు రోజులు వానలు

 

  •     ఆదివారం 18 జిల్లాలు.. సోమవారం 32 జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ
  •     భద్రాచలం, మహబూబ్​నగర్​లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
  •     ఎల్లుండి నుంచి నాలుగు రోజుల పాటు వానలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వడగండ్ల వానలు పడే అవకాశముంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడుతాయని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు చాన్స్​ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం 18 జిల్లాలు.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డికి ఎల్లో అలర్ట్​ జారీ చేసింది.  సోమవారం ఆయా జిల్లాలతో పాటు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్​ జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. మొత్తంగా ఆరోజు 32 జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయని తెలిపింది. మంగళ, బుధవారాలకు ఎలాంటి అలర్ట్​ జారీ చేయకపోయినా.. పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలర్ట్​ జారీ చేసిన రోజుల్లో మాత్రం వడగండ్లు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. 

రెండు జిల్లాల్లో 40 డిగ్రీలు

రాష్ట్రంలో టెంపరేచర్లు పెరుగుతున్నాయి. గురువారం 2 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్​ను దాటాయి. భద్రాచలంలో గరిష్టంగా 40.2 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. మహబూబ్​నగర్​లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్​లో 39.3, ఖమ్మంలో 39, నిజామాబాద్​లో 38.8, రామగుండంలో 38, హైదరాబాద్​లో 37.2 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో వర్షాలతో పాటే ఎండలు కూడా తీవ్రమవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.