సీఎం ఉమ్మడి పాలమూరు పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు

సీఎం ఉమ్మడి పాలమూరు పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు

నాగర్ కర్నూల్/కొల్లాపూర్/గద్వాల, వెలుగు :  ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వనపర్తి ఎస్పీ సునీతారెడ్డి, గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఆయా ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 4న ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టు, గుడ్డెం దొడ్డి రిజర్వాయర్లను సీఎం పరిశీలించనున్నారు. ఇందుకోసం జూరాల సమీపంలోని దేవులపల్లి జెన్కో క్వార్టర్స్ లో రామాలయం పక్కన హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థలాన్ని ఖరారు చేశారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల, నార్లాపూర్ రిజర్వాయర్ స్టేజ్-3 పనులు, కేఎల్ఐ ఎల్లూరు పంప్​హౌజ్​ను సీఎం సందర్శించనుండటంతో హెలిప్యాడ్, రూట్ మ్యాప్, పార్కింగ్, భద్రతా చర్యలపై అధికారులు సమీక్షించారు. నాగర్​కర్నూల్​ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడలో నూతనంగా నిర్మించిన నీటిపారుదల శాఖ కార్యాలయ సముదాయం ప్రారంభోత్సవానికి, కుమ్మెర సమీపంలోని పాలమూరు-రంగారెడ్డి (వట్టెం) పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్ సందర్శనకు అవసరమైన హెలిప్యాడ్, ఇతర పనులను అధికారులు వేగవంతం చేశారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా రహదారుల రిపేర్లు, విద్యుత్ తీగల క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని, పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.