- పదేండ్లలో వందల ఎకరాల్లో భూములు మింగేసిన్రు: మెట్టు సాయికుమార్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ సీఎం రేవంత్ రెడ్డి కాలిగోటికి సరిపోరని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఫైర్ అయ్యారు. ఆదివారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం ఉన్నన్నాళ్లూ అహంకారంతో విర్రవీగి, ఇప్పుడు అధికారం పోగానే మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. పదేండ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుడి, శ్మశానం అనే తేడా లేకుండా వందల ఎకరాల్లో భూములను మింగేశారని ఆరోపించారు.
కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు కాదని.. కల్వకుట్ర తారక రామారావు అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తన తీరును మార్చుకోలేరని, గాడిద ఎంత పరిగెత్తినా గుర్రం కాలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ నేతలు చేసిన పాపాలు రాస్తే రామకోటి, చదివితే భగవద్గీత అవుతాయని పేర్కొన్నారు. కేటీఆర్, హరీశ్ మాదిరిగా కాంగ్రెస్ నేతలెవరూ నీచ రాజకీయాలు, దగాకోరు పనులు చేయరని తెలిపారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
