హైదరాబాద్, వెలుగు: వైద్యారోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయింది. ఈ పోస్టులకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) గురువారం విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల లిస్టును బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in లో అందుబాటులో ఉంచారు. నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం పరీక్ష రాసిన 42 వేల మంది అభ్యర్థుల పూర్తి వివరాలను బోర్డు వెబ్ సైట్ లో పొందుపరిచింది.
ఎంపికైన వారితో పాటు పరీక్ష రాసిన మిగిలిన అభ్యర్థుల మార్కులు, ఇతర వివరాలను అందుబాటులో ఉంచారు. దీనివల్ల అభ్యర్థులు తమ మెరిట్ వివరాలను నేరుగా చూసుకునే అవకాశం కల్పించారు. 2024లో 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయగా తాజాగా మరో 2,322 పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసింది. మొత్తం 9,278 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీని ప్రభుత్వం పూర్తి చేసింది.
