తుఫాను ఎఫెక్ట్.. వర్షాలింకా పోలే.. పొగమంచుతో ఇబ్బందులు

తుఫాను ఎఫెక్ట్.. వర్షాలింకా పోలే.. పొగమంచుతో ఇబ్బందులు

తెలుగు రాష్ట్రాలపై మిచౌంగ్ తుఫాను ప్రభావం విపరీతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో తీరం దాటిన తుఫాను.. ఇప్పుడు ఉత్తర దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది ఛత్తీస్ గఢ్ మీదుగా అల్పపీడనంగా మారి తెలంగాణ ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోని రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

డిసెంబర్ 6న  కుమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 22.1మి.మీ వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట, కొత్త గూడెం జిల్లా మద్దుకూరులో అత్యధిక వర్షపాతం నమోదైంది.

తుఫాను ప్రభావంతో హైదరాబాద్ లో చలి గాలుల తీవ్రత పెరిగింది. దీంతో గత 3 రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణం కంటే 6-7డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఒక్కసారిగా చలి పెరిగింది. తెల్లవారుజామున మంచు కమ్ముకోవడంతో వావానదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 4రోజుల పాటు ఈ తరహా వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.