చదువుతోపాటు కళల్లోనూ ముందుండాలి : మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి

చదువుతోపాటు కళల్లోనూ ముందుండాలి : మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి

ఘట్​కేసర్, వెలుగు: విద్యార్థులకు విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని మేడ్చల్ కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఆదేశించారు. ఘట్​కేసర్ మండలం ఎదులాబాద్​లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్​ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందే భోజన నాణ్యత, హాస్టల్ వసతులు, తరగతి గదుల నిర్వహణను పరిశీలించారు. మధ్యాహ్న భోజన మెనూ, వంటశాల పరిశుభ్రతను తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

చదువుతో పాటు కళల్లోనూ విద్యార్థులు రాణించేలా తగిన సౌకర్యాలు కల్పించాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించకూడదని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఎంఆర్వో చంద్రశేఖర్, ఆర్ఐ సాయిరామ్ పాల్గొన్నారు.