
మేడిపల్లి, వెలుగు: ఓ వ్యక్తి కొంతకాలంగా హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇతర పదార్థాలను కలిపి కల్తీ పాలు తయారు చేసి యథేచ్ఛగా విక్రయిస్తున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ దందాకు ఎస్వోటీ పోలీసులు చెక్ పెట్టారు. కల్తీ పాల స్థావరంపై మల్కాజీగిరి జోన్ ఎస్వోటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫీర్జాదిగూడ మున్సిపల్ పరిధి పర్వతాపూర్ సాయిమహాదేవ్ నగర్ కాలనీలో నివాసముంటున్న మురళీకృష్ణారెడ్డి తన ఇంట్లో కొంత కాలంగా అక్రమంగా కల్తీ పాలను తయారు చేస్తున్నాడు. మిల్క్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించి కల్తీ పాలు తయారుచేసి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో ఎస్వోటీ పోలీసులు శుక్రవారం ఆ స్థావరంపై దాడి చేశారు. 110 లీడర్ల కల్తీ పాలతో పాటు 1.1 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 19 కిలోల గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్, 50 పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.