సెకండ్ డోసు వ్యాక్సిన్ అందక లక్షల మంది తిప్పలు

సెకండ్ డోసు వ్యాక్సిన్ అందక లక్షల మంది తిప్పలు
  • ఈ నెలలో 20లక్షల మందికి సెకండ్ డోసు వేయాలి
  • థర్డ్ వేవ్ భయంతో టీకాకు పెరిగిన రద్దీ
  • రాష్ట్రంలో కోటిన్నర మందికి ఒక్క డోసు కూడా వేయలే

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. కొత్త వాళ్లకు ఫస్ట్ డోసు దొరకడం లేదు. ఫస్ట్ డోసు వేయించుకున్న వాళ్లకు ఇన్‌టైమ్‌లో సెకండ్ డోసు వేయడం లేదు. రాష్ట్రంలో దాదాపు 15.32 లక్షల మందికి సమయానికి సెకండ్ డోసు అందలేదు. ఫస్ట్ డోసు కొవిషీల్డ్‌ తీసుకుని 112 రోజుల గడువు దాటిపోయిన వాళ్లు 12.32 లక్షల మంది ఉండగా, కొవాగ్జిన్ గడువు దాటిపోయినవాళ్లు 3 లక్షల మంది ఉన్నారు. సెకండ్ డోసు కోసం రోజూ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నా వ్యాక్సిన్ దొరకడం లేదని వాపోతున్నారు. జులైలో సుమారు 34 లక్షల మందికి సెకండ్ డోసు వేయాల్సి ఉండగా, 19 లక్షల మందికి మాత్రమే వేశారు. జులైలో మన రాష్ట్రానికి సుమారు 31 లక్షల వ్యాక్సిన్ డోసులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. సెకండ్ డోసు వాళ్లకు మాత్రమే వేస్తే, ఇన్‌టైమ్‌లో దాదాపు అందరికీ సెకండ్ డోసు దొరికేది. కానీ ఫస్ట్ డోసు, సెకండ్ డోసు వ్యాక్సినేషన్ కొనసాగించడంతో చాలా మందికి సెకండ్‌ డోసు టైమ్‌కు అందలేదు. ఆగస్టులో సెకండ్ డోసు వేయించుకోవాల్సిన వాళ్లు ఇంకో 20 లక్షల మందికిపైగా ఉన్నారు. జులైలో మిగిలిపోయిన వాళ్లతో కలిపి,  మొత్తంగా ఆగస్టులో 35 లక్షల మందికి సెకండ్ డోసు వేయాల్సి ఉంది.

ఇన్నాళ్లూ ఆపడంతోనే..

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మన సర్కార్ భిన్న వైఖరిని అవలంబిస్తోంది. ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, ఫస్ట్ డోసుకే ప్రయారిటీ ఇస్తోంది. ఇందులో భాగంగా రెండు డోసుల మధ్య గ్యాప్‌ను పెంచింది. మిగిలిన రాష్ట్రాల్లో కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య గ్యాప్ 84 రోజులు ఉంటే, మన దగ్గర 98 రోజులు చేశారు. వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్న వాళ్లలో కూడా పుష్కలంగా యాంటీబాడీస్ ఉన్నాయన్న స్టడీ ఆధారంగా ఫస్ట్ డోసుకు ప్రాధాన్యం ఇచ్చారు. సెకండ్ డోసు వాళ్లను ఆపుతూ, కొత్తవాళ్లకు ఇస్తూ పోయారు. ఇప్పుడు అదే రివర్స్‌ కొడుతోంది. సెకండ్ డోసు తీసుకోవాల్సిన వాళ్ల సంఖ్య విపరీతంగా ఇప్పుడు ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్‌‌ పూర్తిగా ఆపేస్తే తప్ప అందరికీ సెకండ్ డోసు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.

జనాల క్యూ

థర్డ్‌‌ వేవ్‌‌ భయంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువైంది. కానీ ఒక్కో సెంటర్‌‌‌‌లో రోజూ 150 నుంచి రెండొందల మందికే వేస్తున్నారు. దీంతో జనాలు గంటల తరబడి లైన్‌‌లో నిలబడి వెనక్కి వెళ్లిపోతున్నారు. మరోవైపు డెల్టా, డెల్టా ప్లస్ వంటి వేరియంట్ల నుంచి రక్షణ పొందాలంటే, రెండు డోసులు తీసుకోవాలని తాజా స్టడీలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 1.12 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయగా.. 33.79 లక్షల మందికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇంకో 78.25 లక్షల మందికి సింగిల్ డోసు అందింది. మరో కోటిన్నర మందికి కనీసం ఒక్క డోసు కూడా అందకపోవడం గమనార్హం.
మొదటి డోస్ వ్యాక్సిన్ కొడిమ్యాల పీహెచ్​సీలో తీసుకున్న. రెండో దాని కోసం నాలుగు రోజుల నుంచి తిరుగుతున్న. రెండు సార్లు లైన్లలో గంటలకొద్ది నిలబడ్డా.. అయినా వ్యాక్సిన్​ దొరకలే.  ఇగ నాకు తిరిగే ఓపిక లేదు.
- ఇల్లెందుల శ్యామల. కొడిమ్యాల, జగిత్యాల జిల్లా

నేను మొదటి డోస్ తీసుకొని 90 రోజులపైనే అయింది. నిజామాబాద్​లోని జిల్లా ఆస్పత్రికి వెళ్తే ఫుల్లు జనాలున్నరు. ఇతర సెంటర్లలో నూ పెద్ద పెద్ద లైన్లు ఉన్నయ్. మధ్యాహ్నానికే టీకాలు అయిపోయినయని చెబుతున్నరు. 
‑ శేఖర్, నిజామాబాద్ 

పెరిగిపోయింది

మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న, రెండో డోస్ తీసుకునే టైమ్ వచ్చింది. రెండు మూడు రోజులుగా వ్యాక్సిన్​ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న. కమ్మర్ పల్లి సెంటర్​లో సర్వర్ సమస్య ఉందని చెబుతున్నరు. నాతోపాటు చాలా మంది  వ్యాక్సిన్ దొరక్క ఇబ్బంది పడుతున్నరు.  
‑ మహిపాల్​, మోర్తాడ్​