- రైస్ మిల్లర్లకు సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- వాళ్ల బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్ మా దగ్గర నడ్వయ్
- మిల్లులను తీసుకొని మహిళా సంఘాలకు అప్పగిస్తం
- ఉపాధి నిధులతో మహిళా సంఘాలకు అత్యాధునిక సైలో బ్యాగ్ ప్రాజెక్టులు
- 5 నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తామని వెల్లడి
- పౌరసరఫరాల శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రైస్ మిల్లర్ల బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లను ఎంతమాత్రం సహించేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకొని వేల కోట్లు బకాయి పెట్టిన అక్రమార్కులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, డీఫాల్టర్ల నుంచి ప్రతి పైసా వసూలు చేస్తామన్నారు.
‘‘ఉద్దేశపూర్వకంగా ధాన్యం బకాయిలు ఎగవేసిన మిల్లులను స్వాధీనం చేసుకుని, వాటి నిర్వహణ సహా మిల్లింగ్ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తాం’’ అని స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో బుధవారం పౌరసరఫరాల శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మిల్లింగ్, నిల్వ ప్రక్రియపై చర్చించారు. మిల్లర్ల నుంచి బకాయిలన్నింటినీ రాబట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వసూళ్లను స్పీడప్ చేసేలా విధి విధానాలు రూపొందించండి
గత ప్రభుత్వం మిల్లర్ల అక్రమ దందాకు ఊతమిచ్చిందని, ఆ తప్పిదాన్ని తమ ప్రభుత్వంపై నెట్టేందుకు చూస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వ్యాపార దృక్పథంతో బాధ్యతాయుతంగా మిల్లులు నడిపే వారితో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని, అదే సమయంలో మొండి బకాయిదారులతో కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలను వసూలు చేయడంలో ఇప్పటికే కొంత పురోగతి ఉన్నప్పటికీ చివరి రూపాయి వసూలయ్యేదాకా విడిచి పెట్టవద్దని అధికారులను ఆదేశించారు.వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు విధివిధానాలు రూపొందించి, ఆ నివేదికను మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించాలని సూచించారు. కేబినెట్ సబ్ కమిటీ పరిశీలన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని, మొండిగా వ్యవహరించే మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు నిలిపివేసి.. మిల్లింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగిస్తామన్నారు.
5 జిల్లాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాలు
ధాన్యం సేకరణ సీజన్లలో ప్రతిసారీ తలెత్తుతున్న నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో ఇప్పటికే చేపడ్తున్న పలు చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. ధాన్యం దిగుబడి అధికంగా ఉండే నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అత్యాధునిక ‘సైలో బ్యాగ్’ నిర్మాణాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.
స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాలు కేటాయించి ఈ నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపారు. సైలో బ్యాగ్ ప్రాజెక్టులపై రెవెన్యూ, పౌరసరఫరాలు, మహిళా సంక్షేమ శాఖల మంత్రులతో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించాలని, వీబీ జీ రామ్‌జీ నిధులతో విశాలమైన ప్లాట్‌ఫామ్‌లు నిర్మించి జర్మన్ టెంట్లతో ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసే విధానాలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు.
స్థానిక వసతులు వాడుకోవాలి
ధాన్యం దిగుబడుల ఒత్తిడిని తట్టుకునేందుకు ఎక్కడికక్కడ స్థానిక వసతులను వాడుకోవాలని సీఎం సూచించారు. మండలాలు, గ్రామ స్థాయిలో ఉన్న ప్రైవేటు గోదాములు, ధాన్యం నిల్వకు అనుకూలంగా ఉండే కల్యాణ మండపాలు, పాత సినిమా థియేటర్లు, ఖాళీగా ఉన్న వివిధ షెడ్లను ముందే గుర్తించి లీజుకు తీసుకోవాలన్నారు.
వర్షాకాలంలో ధాన్యం తడిసి పోకుండా, రైతులకు నష్టం వాటిల్లకుండా ఈ అత్యవసర నిల్వ కేంద్రాలు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సౌత్ ఇండియా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తూడి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
