వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌‎లో భారత్‎కు మరో స్వర్ణం.. నజీమ్ కైజైబే మట్టికరిపించిన మీనాక్షి

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌‎లో భారత్‎కు మరో స్వర్ణం.. నజీమ్ కైజైబే మట్టికరిపించిన మీనాక్షి

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ మీనాక్షి హుడా అదరగొట్టింది. 48 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించి సత్తా చాటింది. 2025, సెప్టెంబర్ 14న యునైటెడ్ కింగ్ డమ్ లివర్ పూల్ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ ఫైనల్‎లో కజకిస్థాన్ ప్లేయర్ నజీమ్ కైజైబేపై 4-1 తేడాతో గెలుపొంది గోల్డ్ మెడల్ దక్కించుకుంది మీనాక్షి.

 తొలిసారి ప్రపంచ చాంపియన్ షిప్ బరిలో దిగిన మీనాక్షి హుడా స్వర్ణ పోరుకు అర్హత సాధించడమే కాకుండా ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఫైనల్‎లో ఎంతో బలమైన ప్రత్యర్థిని మట్టికరింపించి ఏకంగా స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ నెగ్గిన మీనాక్షి ఆటో డ్రైవర్ కూతురు కావడం గమనార్హం. 

ఆదివారం (సెప్టెంబర్ 14) లివర్ పూల్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ పోరు హోరాహోరీగా సాగింది. కజకిస్తాన్ క్రీడాకారిణి నుంచి తీవ్రమైన పోటీ ఎదురైనప్పటికీ అద్భుత పోరాట పటిమతో మీనాక్షి స్వర్ణ పతకం గెలుచుకుంది. ప్రత్యర్థిపై స్ట్రాంగ్ పంచులు విసిరిన మీనాక్షి మొదటి రౌండ్‌ను 4-1 తేడాతో నెగ్గగా.. రెండో రౌండ్లో నజీమ్ కైజైబే బలంగా పుంజుకుంది.  

రెండవ రౌండ్‌లో 3-2 తేడాతో మీనాక్షిని ఓడించింది. నిర్ణయాత్మక మూడో బౌట్‎లో ఇద్దరూ బాక్సర్లు హోరీహోరీగా తలపడ్డారు. అయినప్పటికీ మీనాక్షి అద్భుతమైన పంచులతో మూడో రౌండ్లో కజకిస్తాన్ బాక్సర్‎ను ఓడించింది. నలుగురు న్యాయనిర్ణేతలు మీనాక్షికి అనుకూలంగా ఓటు వేయడంతో  4-1 తేడాతో బౌట్ గెలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది ఇండియన్ యంగ్ బాక్సర్.