
లివర్‌పూల్: బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు నాలుగో పతకం ఖాయమైంది. శుక్రవారం జరిగిన విమెన్స్ 48 కేజీ క్వార్టర్స్‌లో మీనాక్షి హుడా .. ఆలిస్ పంఫ్రే(ఇంగ్లండ్)పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. హోరాహోరీగా సాగిన బౌట్‌లో మీనాక్షి బలమైన బ్యాక్ ఫుట్ పంచ్‌లతో విరుచుకుపడింది. దీన్ని అడ్డుకునేందుకు పంఫ్రే ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు. తర్వాత ఇండియన్ బాక్సర్ స్ట్రెయిట్ పంచ్‌లు కొట్టి ఏకగ్రీవంగా విజేతగా నిలిచింది.
ఈ విజయంతో మీనాక్షికి కనీసం కాంస్య పతకం ఖాయమైంది. సెమీస్‌లో మీనాక్షి.. లుట్సైఖానీ అల్టాంట్సెట్సెగ్ (మంగోలియా)తో తలపడుతుంది. జైస్మిన్ లంబోరియా (57 కేజీ), పూజా రాణి (80 కేజీ) ఇప్పటికే సెమీస్‌కు చేరారు. మెన్స్ 50 కేజీ క్వార్టర్స్‌లో జాదుమణి సింగ్ 0–4తో వరల్డ్ చాంపియన్ సాంజ్‌హర్ తష్కెన్‌బే (కజకిస్తాన్) చేతిలో ఓడాడు. ఫలితంగా 10 మంది మెన్స్ బాక్సర్లు పతకం లేకుండానే టోర్నీని ముగించారు. 2013 ఎడిషన్ తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి..