నేటి నుంచి మినీ మేడారం జాతర

నేటి నుంచి మినీ మేడారం జాతర
  • మండమెలిగెతో జాతర షురూ
  • తరలిరానున్న లక్షలాది మంది
  • 700 మంది పోలీసులతో బందోబస్తు
  • నేడు దేవాలయాల శుద్ధి
  • జాతరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్న ఆర్టీసీ

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/ములుగు/, వెలుగు: మేడారం మినీ జాతరకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతుంది. ఈ జాతర ముగిసిన ఏడాది తర్వాత గిరిజన సంప్రదాయం ప్రకారం మండమెలిగె పండుగ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనినే మినీ మేడారం జాతరగా భక్తులు పిలుచుకుంటారు. బుధవారం మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయాలను ఆదివాసీ పూజారులు శుద్ధి చేస్తారు.  పుట్టమట్టితో అలికి ముగ్గులతో అలంకరిస్తారు. ఊరు పొలిమేరల్లో ద్వార స్తంభాలు స్థాపించి గ్రామ నిర్బంధం చేస్తారు. 25న సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పసుపు కుంకుమలతో అర్చన జరిపి పూజలు నిర్వహిస్తారు. 26న దేశవిదేశాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. 27న శనివారం అమ్మవార్లకు ఆలయ పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. దీంతో మండ మెలిగే పండుగ ఘట్టం ముగుస్తుంది.

పూర్తయిన ఏర్పాట్లు

మేడారం మినీ జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు విడిది చేసే ప్రాంతాలలో హైమాస్ట్‌‌‌‌ లైట్లను అమర్చారు. గద్దెలకు సమీపంలోని కల్యాణ మండపంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ఇద్దరు డాక్టర్లు, 20 మంది వైద్య సిబ్బంది డ్యూటీలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. దొంగతనాలను నియంత్రించడానికి జాతర ప్రాంగణంలో 35 సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. గద్దెల వద్ద నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు, హుండీల రక్షణ కోసం 50 మంది సిబ్బందిని నియమించారు. భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, టాయిలెట్లను ఏర్పాటు చేశారు. రక్షిత తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక వాటర్‌‌‌‌ ట్యాంకర్లను తిప్పనున్నారు. మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో ఉన్న చేతిపంపులను రిపేర్‌‌‌‌ చేయించారు. జంపన్నవాగులో ఇసుకను లెవల్‌‌‌‌ చేశారు. భక్తుల స్నానాల కోసం ట్యాప్స్‌‌‌‌ అమర్చారు.

గేట్లకు తాళం

మండమెలిగే పండుగ నేపథ్యంలో బుధవారం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద భక్తుల రద్దీ పెరగనుంది. దీంతో అధికారులు గేట్లకు తాళం వేసి దూరం నుంచే భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లను కూడా పొడిగించారు. వృద్ధులు, వికలాంగులను ప్రత్యేక క్యూలైన్లలో పంపిస్తారు. జాతర సందర్భంగా 15మంది సీఐలు, 36 మంది ఎస్సైలతోపాటు 700 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు ములుగు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య చెప్పారు. భక్తుల వెహికల్స్​ పార్కింగ్​కు చిలుకలగుట్ట, ప్రధాన క్యాంపు, ఇంగ్లీష్​ మీడియం స్కూల్, ఏఎస్ఆర్​ హోటల్​వద్ద ఏర్పాట్లు చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మినీ జాతర నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. హన్మకొండ బస్టాండ్‌‌‌‌ నుంచి 30 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

పనులన్నీ పూర్తి చేశాం

మినీ మేడారం తరలివచ్చే భక్తులకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తుల కోసం ఐదు షెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. వెయ్యి మంది భక్తులకు వసతి అవకాశం ఉంది. జిప్రతిరోజు సుమారు 150 మంది కూలీలతో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగిస్తాం. మినీ మేడారం జాతరతోపాటు బయ్యక్కపేట, నార్లాపూర్​, కొండాయి గ్రామాల్లో జరిగే మినీ జాతరల వద్ద కూడా ఏర్పాట్లు చేశాం. భక్తులు కొవిడ్​రూల్స్​పాటిస్తూ అమ్మవార్లను దర్శించుకోవాలి. – కృష్ణ ఆదిత్య, కలెక్టర్, ములుగు

 

ఇవి కూడా చదవండి 

6, 7, 8 తరగతులకు ఇయ్యాల్టి నుంచి స్కూల్స్​​ షురూ

కేసీఆర్.. ఫైళ్లు ముడ్తలే.. రివ్యూలు చేస్తలే

కార్డియాక్ అరెస్టా.. ? ఇట్ల బయటపడొచ్చు